బుధవారం 03 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:01:32

మగ్గమెక్కిన బతుకమ్మ చీరె

మగ్గమెక్కిన బతుకమ్మ చీరె

  • సిరిసిల్లలో తయారీ షురూ

సిరిసిల్ల, నమస్తే తెలంగాణ/ సిరిసిల్ల రూరల్‌: వస్త్రపురిలో బతుకమ్మ చీరెల తయారీ మొదలైంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో  ఈ నెల 2న తంగళ్లపల్లి శివారులోని టెక్స్‌టైల్‌ పార్కులో,  6వ తేదీ నుంచి సిరిసిల్ల, చంద్రంపేట, తంగళ్లపల్లి గ్రామాల్లో సాంచాల సవ్వడి ప్రారంభమైంది. ఈ మేరకు దాదాపు 40 వేల సాంచాల్లో 30 వేలకుపైగా నడుస్తున్నాయి. బతుకమ్మ చీరెలకు సంబంధించి ఇటీవల నూలు(యార్న్‌) రాగా, పండుగ వాతావరణంలో తయారీ మొదలైంది.  దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. 

కాగా, తయారీ సమయంలో కార్మికులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ రాత్‌ పైలీ, దిన్‌ పైలీ చేస్తున్నారు. నిర్ణీత గడువు సెప్టెంబర్‌లోపే చీరెల ఉత్పత్తిని పూర్తి చేసేందుకు చేనేత జౌళిశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. వస్త్ర ఉత్పత్తులు మొదలవ్వడంతో మంత్రి కేటీఆర్‌ స్పందించారు. టెక్స్‌టైల్‌, అపెరల్‌ పార్కుల ద్వారా సిరిసిల్ల వస్ర్తాలకు బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకరావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. చీరెల తయారీపై సంతోషం వ్యక్తంచేస్తూ, ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. లాక్‌డౌన్‌తో మూతపడ్డ పరిశ్రమను తెరిపించి, తమకు చేతినిండా పని కల్పించినందుకు మంత్రి కేటీఆర్‌కు కార్మికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


logo