గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 07:03:02

వరదలపై తెలంగాణ, ఏపీ సీఎంలతో మాట్లాడిన ప్రధాని

వరదలపై తెలంగాణ, ఏపీ సీఎంలతో మాట్లాడిన ప్రధాని

హైదరాబాద్‌ : తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలో వానలు, వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాత్రి రెండు రాష్ట్రాల సీఎం కేసీఆర్‌, జగన్‌తో మాట్లాడారు. రెస్క్యూ, రిలీఫ్‌ వర్క్‌లో కేంద్రం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో వినాశనం కలిగించిన కుండపోత వర్షం కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. నాగర్‌కూర్నూల్ జిల్లాలో ఇల్లు కూలిన సంఘటనలో మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. అలాగే ఏపీలో భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పది మంది మరణించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో తెలుగులో పోస్ట్‌ చేశారు. భారీ వర్షాల వల్ల ఉత్పన్నమైన పరిస్థితిని ఉద్దేశించి తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌తో మాట్లాడాను. వారికి కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చాను. వర్షాల బాధితుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo