సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 09, 2020 , 02:25:37

మూలస్తంభంలా విద్యుత్‌

మూలస్తంభంలా విద్యుత్‌


సామాజిక ఆర్థిక సర్వే వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో రాష్ట్రం ముందంజలో ఉండటానికి మూలస్తంభంలా విద్యుత్‌ రంగం నిలబడింది. రాష్ట్రం ఏర్పడేనాటికి 2,700 మెగావాట్ల విద్యుత్‌ కొరతతో ఉండగా.. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను పకడ్బందీగా అమలుచేశారు. ఫలితంగా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనివిధంగా వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ను ఇస్తున్న ఖ్యాతిని గడించింది. ఆరేండ్లలో 16,261 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ సామర్థ్యానికి చేరుకొన్నది. దీనితోపాటు రూ.39,233 కోట్ల వ్యయంతో భద్రాద్రి (1,080 మెగావాట్లు), యాదాద్రి (4,000 మెగావాట్లు) థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నది. విద్యుత్‌ కొరతతో మొదలైన తెలంగాణ ప్రస్థానం.. మిగులు విద్యుత్‌ రాష్ట్రం దిశగా సాగుతున్నది. ఈ విషయాన్ని సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.


మెరుగుపడిన గ్రిడ్‌ నిర్వహణ

గ్రిడ్‌ నిర్వహణ కోసం 2018 జనవరిలో నాగార్జునసాగర్‌ జల విద్యుత్‌ కేంద్రంలో రివర్సిబుల్‌ పంపింగ్‌ను ప్రారంభించారు. దీంతో ఆఫ్‌ పీక్‌ సమయంలో తక్కువ ధరకు నీటిని రివర్స్‌ పంపింగ్‌ చేసుకొని గరిష్ఠ డిమాండ్‌ ఉన్న సమయంలో జలవిద్యుత్‌ ఉత్పత్తి చేపట్టడం ద్వారా రాష్ర్టానికి ఆర్థిక లాభంతోపాటు గ్రిడ్‌ను సమర్థంగా నిర్వహిస్తున్నది. 2019 డిసెంబరు నాటికి 1.53 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా.. వీటికి 24 గంటలపాటు నిరంతర విద్యుత్‌ సరఫరాకు వీలుగా 112 ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్లు, 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 833తోపాటు 2.54 లక్షల విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను అదనంగా ఏర్పాటుచేశారు.


అందుబాటులో సోలార్‌ పాలసీ 

తెలంగాణ వచ్చేనాటికి కేవలం 74 మెగావాట్ల సౌరవిద్యుత్‌ అందుబాటులో ఉండగా.. 2019 నాటికి దీనిని 3,645 మెగావాట్లకు చేర్చారు. ఇందుకోసం సోలార్‌ పాలసీ-2015ను తయారుచేసి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. 2020-21 నాటికి సౌరవిద్యుత్‌ 5,000 మెగావాట్లకు చేరేలా ముందుకు సాగుతున్నారు. కేంద్రం ప్రారంభించిన ఉదయ్‌ స్కీంలో చేరడం వల్ల తెలంగాణ డిస్కంలపై గణనీయమైన ఆర్థిక భారం తగ్గింది. 2030 నాటికి ప్రజారవాణాలో 100%, వ్యక్తిగత వాహనాల్లో 40% ఎలక్ట్రికల్‌ వెహికిల్స్‌ ఉండనున్నాయనే అంచనాలకు అనుగుణంగా ట్రాన్స్‌కో చార్జింగ్‌ ఏజెన్సీలను ఏర్పాటుచేస్తున్నది.logo