మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 02:38:36

తక్కువ ధరకే టైల్స్‌

తక్కువ ధరకే టైల్స్‌

  • మంత్రి కేటీఆర్‌ విజన్‌లో భాగమే ప్లాంట్‌:  రాంకీ ఎన్విరో ఎండీ గౌతమ్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే మంత్రి కేటీఆర్‌ విజన్‌లో భాగంగానే హైదరాబాద్‌ శివారు జీడిమెట్లలో సీ అండ్‌ డీ ప్లాంటును ఏర్పాటుచేశామని రాంకీ ఎన్విరో సంస్థ ఎండీ, సీఈవో గౌతంరెడ్డి తెలిపారు. 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంగల ఈ ప్లాంటులో రోజుకు 470 మెట్రిక్‌ టన్నులు ప్రాసెసింగ్‌ అవుతుందని, దానిద్వారా పార్కింగ్‌ టైల్స్‌, ఫుట్‌పాత్‌ టైల్స్‌ వంటివి తయారుచేస్తున్నామని చెప్పారు. నగరం చుట్టూ ఏర్పాటుచేయనున్న నాలుగుప్లాంట్లు అందుబాటులోకి వస్తే 1700 నుంచి 1800 వరకు ప్రాసెసింగ్‌ అయ్యే అవకాశం ఉన్నదని వివరించారు. 

వీటిద్వారా ఉత్పత్తవుతున్న టైల్స్‌ను జీహెచ్‌ఎంసీ నిర్మిస్తున్న ఫుట్‌పాత్‌లకు వినియోగిస్తున్నారని.. రానున్న రోజుల్లో ఇతర మున్సిపాలిటీలు, ప్రైవేటుగా విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టన్ను వ్యర్థానికి రూ.342 చెల్లిస్తే ఇంటివద్దకే వచ్చి దానిని తీసుకెళ్తారని పేర్కొన్నారు. నిర్మాణ వ్యర్థాల రీ సైక్లింగ్‌తో 80-20 ఎంఎం సైజు కంకర 30 శాతం, 20-08 సైజు కంకర 25 శాతం, ముడి ఇసుక 20 శాతం, మంచి ఇసుక 20 శాతం, ప్లాస్టిక్‌, కట్టె తదితర వస్తువులు 5శాతం వస్తాయని చెప్పారు. తాము తయారుచేస్తున్న టైల్స్‌ బయట మార్కెట్లో దొరికేవాటికంటే నాణ్యతతో ఉంటాయని.. ధర కూడా 30-40 శాతం వరకు తక్కువగా ఉంటుందని తెలిపారు. ప్లాంట్ల వల్ల స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, పెద్దగా శబ్దం లేకుండానే ప్రాసెసింగ్‌ జరుగుతుందని చెప్పారు. ప్రాసెసింగ్‌ సందర్భంగా వ్యర్థాలపై నీళ్లు చిమ్ముతుంటామని.. దీంతో దుబ్బ పైకిలేచే అవకాశం లేదన్నారు. 

ప్లాంట్‌ను పూర్తిగా షెడ్‌లోనే ఏర్పాటుచేశామని, మట్టికణాలు బయటకు వెళ్లవని వివరించారు. వ్యర్థాల తరలింపునూ శాస్త్రీయ పద్ధతుల్లోనే నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్లాంట్‌ ఏర్పాటులో ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నదని చెప్పారు. జీడిమెట్లతోపాటు, ఫతుల్లగూడలో ప్లాంట్లు పూర్తయ్యాయని, త్వరలో కొత్వాల్‌గూడ, జవహర్‌నగర్‌లో ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా నగరాల్లో 30 ప్లాంట్ల వరకు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సొంత రాష్ట్రం, సొంత నగరంలో అత్యాధునిక సీ అండ్‌ డీ ప్లాంటును ఏర్పాటుచేయడం గర్వంగా ఉన్నదని చెప్పారు.