శనివారం 30 మే 2020
Telangana - May 13, 2020 , 15:49:11

నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు

నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు

నిర్మల్ :  భైంసాలో అల్లర్లలో కారకులైన వారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని జిల్లా ఎస్పీ శ్రీ.సి.శశిధర్ రాజు అన్నారు. భైంసా పట్టణంలోని వీధుల్లో పోలీసు సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యం మత్తులో ఒక వ్యక్తి చేసిన తప్పిదం వల్ల ఏర్పడిన ఘర్షణల్లో ఆస్తులు ధ్వంసం చేయడం సరికాదన్నారు. పోలీసు బందోబస్తు ఉన్న సమయంలో ప్రశాంతంగా ఉండడం మళ్లీ బందోబస్తు ఎత్తివేసిన తర్వాత అల్లర్లకు పాల్పడడం మంచి పద్ధతి కాదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి  తీసుకొని ఘర్షణలకు దిగితే  నష్టపోతారని, దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

వరుస సంఘటనల వల్ల బైంసా పట్టణ అభివృద్ధి కుంటుపడుతుందని అలాగే యువత కేసుల్లో ఇరుక్కుని జైలు పాలైతే వారి భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఇరు వర్గాల ప్రజలు సంయమనం పాటించి శాంతియుత వాతావరణం నెలకొనెలా సహకరించాలని కోరారు. ఎవరికివారు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ పండగలను శాంతి సామరస్యాలతో జరుపుకోవాలని హితవు పలికారు. లాక్ డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటిస్తూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని పేర్కొన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి లాక్ డౌన్ ఉల్లంఘన కేసులో ఇరుక్కోవ్దని హితవు పలికారు.  పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రస్తుతం శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయ,  ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళనకు గురికావద్దని కోరారు. 


logo