బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 02:16:14

ఐసెట్‌లో ఉత్తీర్ణత 90. 28 శాతం

ఐసెట్‌లో ఉత్తీర్ణత 90. 28 శాతం

  • అర్హత సాధించిన నలుగురు ట్రాన్స్‌జెండర్లు

భీమారం (వరంగల్‌): తెలుగు రాష్ర్టాల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 1 తేదీల్లో నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌ -2020 ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ కామర్స్‌ భవనంలో సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి, ఐ సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్‌ పురుషోత్తం ఫలితాలను విడుదల చేశారు. 2020-21 విద్యా సంవత్సరానికి ఐసెట్‌కు 58,392 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 45,975 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 41,506 మంది (90.28 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల విభాగంలో 22,912 మంది అభ్యర్థులకు 20,816 (90.85శాతం) మంది, అమ్మాయిల్లో 23,059 మందికి 20,686 (89.71 శాతం) అర్హత పొందారు. నలుగురు ట్రాన్స్‌జెండర్లు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో హైదరాబాద్‌ అమీర్‌పేటకు చెందిన బీ శుభశ్రీ 159.55 మార్కులతో మొదటి ర్యాంకు, నిజామాబాద్‌లోని ఆర్మూర్‌కు చెందిన గైని సందీప్‌ 144.50 మార్కులతో రెండో ర్యాంకు సాధించారు. టాప్‌ 20 ర్యాంకుల్లో అబ్బాయిలే ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీ తొమ్మిదోసారి టీఎస్‌ ఐసెట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు కేయూ రిజిస్ట్రార్‌ పురుషోత్తం, టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్‌ రాజిరెడ్డిని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి అభినందించారు.