సోమవారం 13 జూలై 2020
Telangana - May 28, 2020 , 18:50:11

కొండ పోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవ వివరాలివే...

కొండ పోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవ వివరాలివే...

గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష. ఉమ్మడి జిల్లా ఆకాంక్ష నెరవేరబోతున్నదని, 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండ పోచమ్మ సాగరుకు నీటిని ఎత్తిపోసే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రారంభించనున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ఐఓసీ కార్యాలయంలో సాయంత్రం ఏంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 

మంత్రి హరీశ్‌ వివరాలు వెలువరిస్తూ అన్ని పండుగల సమూహారం రేపటి పెద్ద జల పండుగ అన్నారు. మే 29 చరిత్రలో ఎప్పుడూ నిలబడే రోజు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సాదాసీదాగా జరుపుతున్నాం. కరోనా లేకపోతే.. లక్షలాది ప్రజల మధ్య జరుపుకునేవాళ్ళం అన్నారు మంత్రి. 

ఈ కార్యక్రమానికి మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డిలు హాజరుకానున్నారని తెలిపారు. వీరితో పాటు సిద్ధిపేట, మెదక్‌, యాదాద్రి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు పాల్గొంటారని పేర్కొన్నారు. 

కార్యక్రమానికి సంబందించి మంత్రి వివరించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • కొండ పోచమ్మ దేవాలయంలో ఉదయం వేకువజామున 4.30 గంటలకే చండీయాగం ప్రారంభం అవుతుంది.
 • గ్రామ సర్పంచ్‌ రజిత- రమేశ్‌, కొండ పోచమ్మ దేవాలయ చైర్మన్‌ ఉపేందర్‌ రెడ్డి చండీహోమం నిర్వహిస్తారు.
 • సీఎం కేసీఆర్‌ సతీ సమేతంగా ఉదయం 7 గంటలకు చేరుకుని అమ్మవారికి జరిపే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించి వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. 
 • ఆ తర్వాత ఉదయం 9.35 గంటలకు ఎర్రవల్లిలో రైతు వేదికకు శంకుస్థాపన చేస్తారు. 
 • ఆ తర్వాత ఉదయం 9.40 గంటలకు మర్కుక్‌లోని రైతు వేదికకు శంకుస్థాపన చేస్తారు. 
 • ఉదయం 9.50 నిమిషాలకు సీఎం మర్కుక్‌ పంప్‌ హౌస్‌ చేరుకుంటారు. 
 • మర్కుక్‌ పంప్‌ హౌస్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్‌ వద్దకు చేరుకునే త్రిదండి చినజీయర్‌ స్వామి వారి వద్దకు 10 గంటల సమయంలో సీఎం చేరుకుంటారు. 
 • త్రిదండి చినజీయర్‌ స్వామిని సీఎం కలిసి మర్కుక్‌ పంప్‌ హౌస్‌ వద్ద సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం దంపతులు పాల్గొంటారు. 
 • సుదర్శన హోమం, పూర్ణాహుతి ముగిసిన తర్వాత 11.30 గంటల సమయంలో పంప్‌ హౌస్‌ను సీఎం ప్రారంభిస్తారు. 
 • ఆ తర్వాత చినజీయర్‌ స్వామితో కలిసి కొండ పోచమ్మ సాగర్‌ కట్ట మీద డెలివరీ సిస్టమ్‌ దగ్గరకు చేరుకుంటారు. 
 • 11.35 గంటలకు డెలివరీ సిస్టమ్‌ దగ్గర గోదావరి జలాలను స్వాగతిస్తూ.. ప్రత్యేక పూజా కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొంటారు. 
 • ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కొండ పోచమ్మ డెలివరీ సిస్టమ్‌ నుంచి బయలుదేరి వరదరాజుపూర్‌ గ్రామంలోని వరద రాజేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తారు.
 • 12.40 గంటలకు వరదరాజు పూర్‌ నుంచి బయలుదేరి మర్కుక్‌ పంప్‌ హౌస్‌ దగ్గరకు సీఎం చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొంటారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పరిమిత ప్రజా ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానం ఉంది. ఇది జల పండుగ లక్షలాది ప్రజలతో జరువుకోవాలి. కానీ కరోనా వల్ల ఆహ్వానించలేక పోతున్నాం. కరోనా ముగిసిన తర్వాత పెద్ద పండుగ చేసుకుందాం అన్నారు మంత్రి హరీష్‌ రావు. గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులను మాత్రమే ఆహ్వానిస్తున్నామని, మనమంతా కలిసి జరుపు కోవాల్సిన జల పండగ కానీ కరోనా నేపథ్యంలో ఇది సాధ్యం కాదన్నారు. రేపు ముఖ్యమంత్రి కేవలం ప్రారంభిస్తారు, రేపటి నుండి ప్రారంభం అవుతున్నదని రేపటి తరువాత ప్రజలు ఎవరైనా వచ్చి సామాజిక దూరాన్ని పాటిస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్‌ సందర్శించవచ్చు అన్నారు మంత్రి.


logo