బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 09, 2020 , 18:32:20

పోలీస్ స్టేషన్ లో ఒక్కటైన ప్రేమ జంటలు

పోలీస్ స్టేషన్ లో ఒక్కటైన ప్రేమ జంటలు

ఖమ్మం : జిల్లాలోని చింతకాని పోలీస్ స్టేషన్- 2 లో ఎస్ఐ రెడ్డబోయిన ఉమ ఆధ్వర్యంలో ఆదివారం రెండు జంటలను ఒక్కటి చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. లచ్చగూడెం గ్రామానికి చెందిన అనూష, తల్లాడ గ్రామానికి చెందిన గోపీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి వివాహానికి పెద్దల అంగీకారం లభించకపోవడంతో వధువు అనూష చింతకాని ఎస్ఐ ఉమను ఆశ్రయించింది. 

ఎస్ఐ వధువరులకు చెందిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వివాహానికి ఒప్పించారు. ఆదివారం లచ్చగూడెం ఆలయంలో గ్రామ పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. అలాగే మండల పరిధిలో గాంధీనగర్ గ్రామానికి చెందిన మరో జంట స్వప్న-సాయి కుమార్ మూడు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. గాంధీనగర్ కు చెందిన వధువు స్వప్న అప్పటికే నెలల గర్భవతిగా ఉండడంతో ఆమె ఎస్ఐ  ఉమను ఆశ్రయించింది.


దీంతో ఖమ్మంకు చెందిన సాయి కుమార్ కు ఎస్ఐ ఉమ కౌన్సిలింగ్ ఇచ్చి వారిద్దరిని చింతకాని పోలీస్ స్టేషన్ సాక్షిగా, గ్రామ పెద్దల సమక్షంలో ఒక్కటి చేశారు. ఆయా వివాహాల కార్యక్రమాలలో సర్పంచ్ లు గురజాల యూన్సీ, కాళంగి లలిత, వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, గ్రామ పెద్దలు మర్రి ప్రకాష్, స్టేషన్ సిబ్బంది, బంధువులు తదితరులు పాల్గొన్నారు.


logo