సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:49:40

రాష్ట్ర ప్రతిష్ఠను ప్రతిబింబించేలా..

రాష్ట్ర ప్రతిష్ఠను ప్రతిబింబించేలా..

  • రాష్ట్ర పరిపాలనా కేంద్రం.. అన్ని సౌకర్యాలూ ఉండాలి
  • కొత్త సచివాలయం సమీపంలోనే శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణం 
  • ప్రాంగణంలో ప్రార్థనా మందిరాల ఎక్కడ ఉండాలో నిర్ణయించండి
  • తుది నిర్ణయం అనంతరం టెండర్లు
  • అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొత్తగా నిర్మించే సెక్రటేరియట్‌ భవన సముదాయం అటు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా రూపొందాలని, అదే సందర్భంలో రాష్ట్ర పరిపాలనా కేంద్రానికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిలషించారు. నూతన సచివాలయం నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ సెక్రటేరియట్‌ నూతన భవన సముదాయం రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలను, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి. అదే సందర్భంగా పూర్తి సౌకర్యవంతంగా ఉండాలి. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శులు అంతా అందులోనే తమ విధులు నిర్వర్తించేలా ఉండాలి. గతంలో మాదిరిగా అక్కడొకరు, ఇక్కడొకరు విసిరేసినట్టు ఉండొద్దు’ అని చెప్పారు. సెక్రటేరియట్‌ సమీపంలోనే అన్ని ప్రభుత్వశాఖల విభాగాధిపతుల కార్యాలయాల సముదాయాన్ని కూడా నిర్మిస్తామని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా ఒకే దగ్గర ఉంటుందని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

లోపల కూడా సౌకర్యంగా..

కొత్త సెక్రటేరియట్‌ బాహ్యరూపం ఎంత హుందాగా, గొప్పగా ఉంటుందో లోపల కూడా అంత సౌకర్యవంతంగా, అన్ని వసతులతో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. మంత్రులు, కార్యదర్శుల చాంబర్లు, సమావేశ మందిరాలు, సిబ్బంది కార్యాలయాలు, లంచ్‌హాల్స్‌, సెంట్రలైజ్డ్‌ స్ట్రాంగ్‌రూమ్‌, రికార్డురూములు తదితరాలు ఎలా ఉండాలో నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాలు, బ్యాంకు, క్రష్‌, విజిటర్స్‌ రూమ్‌, పార్కింగ్‌, భద్రతా సిబ్బంది నిలయం తదితర ఏర్పాట్లు ఎక్కడ ఎలా ఉండాలో నిర్ణయించాలని చెప్పారు. సౌకర్యాలు, సదుపాయాల విషయంలో తుది నిర్ణయం తీసుకుని టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


logo