శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 03:20:22

గిరిజన భూహక్కులకు భంగం కాదు

గిరిజన భూహక్కులకు భంగం కాదు

  • కొత్త రెవెన్యూ చట్టం భూమి హక్కుల రికార్డుకు ఉద్దేశించింది
  • ఉన్న 80కిపైగా చట్టాల్లో ఇది ఒకటి మాత్రమే
  • గిరిజన భూహక్కు చట్టాలు యథాతథం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం ఏ చట్టానికి ప్రత్యామ్నాయం కాదని, కేవలం భూమి రిజిష్ర్టేషన్‌, రికార్డుల నమోదుకు సంబంధించింది మాత్రమేనని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యవసాయం చేసుకునే రైతులు భూమి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ కోసం పనులన్నీ వదులుకొని రోజులతరబడి ఆఫీసులచుట్టూ తిరిగే భారాన్ని తగ్గించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం - 2020’ను తీసుకొచ్చింది. అయితే ఈ చట్టం వల్ల వివిధ వర్గాల ప్రజలకు ఏదో నష్టం జరిగిపోతుందని అప్పుడే దుష్ప్రచారాలు మొదలయ్యాయి. ఈ ప్రచారాలను భూ వ్యవహారాల నిపుణులు ఖండిస్తున్నారు. గిరిజనుల భూహక్కులకు సంబంధించి ఎల్‌టీఆర్‌ చట్టం, అటవీహక్కుల చట్టం వంటివి అమలులో ఉన్నాయి. ఇవేకాదు రెవెన్యూ విభాగంలో 80కిపైగా చట్టాలు ఉన్నాయని, అందులో ఇది ఒకటి అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. 

గిరిజనచట్టాలతో సంబంధమే లేదు

కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో షెడ్యూల్‌ ఏరియా ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరుతూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఈఏఎస్‌ శర్మ గవర్నర్‌కు రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. గిరిజన భూహక్కుల చట్టాలకు కొత్త రెవెన్యూ చట్టానికి ఎక్కడా సంబంధం లేదని భూచట్టాల నిపుణుడు, నల్సార్‌ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు ఎం సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టం వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, రికార్డుల సత్వర మార్పిడికి సంబంధించినది మాత్రమేనని వివరించారు. కొత్త రెవెన్యూ చట్టం వల్ల గిరిజన ప్రాంతాల్లో అమల్లో ఉన్న చట్టాలేవీ మారవని, అక్కడి ఏజెన్సీ కోర్టులు సైతం యథాతథంగా ఉంటాయని తెలిపారు. కొత్తగా తెచ్చిన చట్టం ద్వారా భూమి హక్కు లు కలిగిన వారికి వారి హక్కులను రికార్డు చేస్తారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలకు వర్తించే ఎల్‌టీఆర్‌ చట్టంలో ప్రస్తుతం కొత్త చట్టం వల్ల ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టంచేశారు. 

గిరిజన చట్టాలకు ప్రత్యామ్నాయం కాదు..

గిరిజన ప్రాంతాలకుగానీ, ఇతర ప్రాంతాలకుగానీ ఇప్పటికే అమలులో ఉన్న ఏ చట్టాన్ని భర్తీ చేసే (ఓవర్‌రైడ్‌) అధికారం కొత్త రెవెన్యూ చట్టానికి లేదు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎల్‌టీఆర్‌, భూబదలాయింపు, ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌, అటవీహక్కుల చట్టాలన్నింటికీ లోబడి మాత్రమే కొత్త రెవెన్యూ చట్టం పనిచేస్తుంది. ట్రైబల్‌ ఏరియాల్లో నాన్‌ ట్రైబల్స్‌ ఎవరైనా భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా.. ఇప్పటికే ఉన్న చట్టాల్లోని నిబంధనల ప్రకారం వాటిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. మొత్తం రెవెన్యూ విభాగంలో ఉన్న అన్ని చట్టాలకు కొత్త రెవెన్యూ చట్టం ప్రత్యామ్నాయం అని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ఈ నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టం వల్ల ఎవరి హక్కులకు ఎటువంటి భంగం కలుగుదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రత్యేకంగా గిరిజన భూహక్కుల చట్టాలు యథాతథంగా ఉంటాయని, వాటికి ఎలాంటి ఢోకా ఉండదని చెప్తున్నారు. logo