బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 03, 2020 , 00:58:33

రాష్ట్రంపై కేంద్రం కత్తి

రాష్ట్రంపై కేంద్రం కత్తి
  • సంపద సృష్టిస్తున్నతెలంగాణపై ఆంక్షలు
  • శిక్షగా మారిన ఆర్థిక క్రమశిక్షణ
  • అభివృద్ధిని నిర్లక్ష్యంచేసే రాష్ర్టాలకు అగ్రతాంబూలం

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తెలంగాణకు శాపంగా మారతున్నది. ప్రగతిశీల విధానాలతో సొంత రాబడులను పెంచుకుంటూ, సంపదను సృష్టిస్తూ, సుస్థిర ఆర్థిక ప్రగతితో పరుగులుతీస్తున్న తెలంగాణకు కేంద్ర విధానాలు ప్రతిబంధకాలుగా మారాయి. ఆర్థిక క్రమశిక్షణలో మేటిగా నిలుస్తున్న తెలంగాణను ప్రోత్సహించకపోగా రాష్ర్టాన్ని ఆర్థికంగా శిక్షించేలా నిర్ణయాలను తీసుకొంటున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తోపాటు ఆదాయం పన్ను (ఐటీ)లో కేంద్రానికి ఎక్కువ వాటా ఇస్తున్న తెలంగాణకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా మోదీ సర్కారు చర్యలుండాలి. కానీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న కేంద్రం.. అభివృద్ధిని నిర్లక్ష్యంచేసి ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్న రాష్ర్టాలను ప్రోత్సహిస్తున్నది. ద్రవ్యలోటును, జనాభా వృద్ధిరేటును నియంత్రించడంతోపాటు ప్రజల తలసరి ఆదాయాన్ని, కేంద్రానికి రాబడులను పెంచుతున్న తెలంగాణకు మోదీ సర్కారు అడుగడుగునా అన్యాయం చేస్తున్నది. 


రాష్ట్రంలో ఎటుచూసినా అభివృద్ధే

వాస్తవానికి దక్షిణాది రాష్ర్టాల్లో ప్రత్యేకించి తెలంగాణలో జనాభా వృద్ధిరేటు తక్కువగా ఉన్నది. జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందున్నది. ఫర్టిలిటీ రిలీజ్డ్‌ నేషనల్‌ హెల్త్‌సర్వే ప్రకారం.. జాతీయ సంతాన వృద్ధిరేటు 2.33 శాతంగా ఉండగా తెలంగాణలో 1.8 శాతంలోపే ఉన్నది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, పరిపాలనా సంస్కరణల వల్ల రాష్ట్ర సంపద, ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా వృద్ధిచెంది తలసరి ఆదాయం రూ.2,15,000కు పెరిగింది. జాతీ య సగటు తలసరి ఆదాయం కేవలం రూ. 1,35,050గా ఉన్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడానికి ముందు రూ.3.59 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ సంపద ఆరేండ్లు తిరక్కుండానే రూ.8.66 లక్షల కోట్లకు పెరిగింది. రాష్ట్ర మొత్తం సంపదలో 25 శాతం అప్పులు తీసుకునేందుకు వీలున్నప్పటికీ కేవలం 22 శాతం మేరకే అప్పులు తీసుకుని ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న అతికొద్ది రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది.


పుచ్చుకునేది కొండంత.. ఇచ్చేది గోరంత

సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్ను, కస్టమ్స్‌ పన్ను, ఇన్‌కంట్యాక్స్‌, జీఎస్టీ, ఐజీఎస్టీ తదితర రూపాల్లో తెలంగాణ నుంచి కేంద్ర ఖజానాకు రూ.50 వేల కోట్లకుపైగా చేరుతున్నా, కేంద్రం నుంచి రాష్ట్ర ఖజానాకు రూ.25 వేల కోట్లు కూడా రావడంలేదు. తక్కువ జనాభా, ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ర్టాలకు 15వ ఆర్థిక సంఘం వెయిటేజీని తగ్గించడంతో కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే పన్నుల వాటా, గ్రాంట్లు నానాటికీ తగ్గుతున్నాయి. ఈ విధం గా కేంద్రం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.18,964 కోట్లు వచ్చాయని, వచ్చే ఆర్థిక ఏడాది (2020-21) లో ఈ రాబడి రూ.18,241కు తగ్గుతుందని ఆర్థిక సంఘం అంచనా వేసింది. ఈ లోటును పూడ్చేందుకు ప్రత్యేక గ్రాంట్ల రూపంలో తెలంగాణకు రూ.723 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. కానీ వెయిటేజీని తగ్గించడం వల్ల రాష్ర్టానికి దాదాపు రూ.2 వేల కోట్ల నష్టం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.


జనాభా వెయిటేజీని తగ్గించినా..

రాష్ర్టాల పన్నుల వాటాను 42 నుంచి 50 శాతానికి పెంచాలని, జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం తగదని రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘంపై తెచ్చిన ఒత్తిడి కొంతవరకు ఫలించింది. దీనిపై సీఎం కేసీఆర్‌ ఆర్థిక సంఘానికి సమగ్ర నివేదికను కూడా సమర్పించారు. దీన్ని ఇతర రాష్ర్టాలు కూడా బలపరిచాయి. వాస్తవానికి 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్రం పన్నుల ద్వారా వచ్చిన మొత్తం రాబడిలో 42 శాతం నిధులను అన్ని రాష్ర్టాలకు పంచుతున్నది. ఈ పంపకాల్లో కేంద్రం రాష్ర్టాల ఆర్థిక పరిస్థితిని, వైశాల్యాన్ని, జనాభా సంఖ్యను, ఆర్థిక క్రమశిక్షణను, అటవీ విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా రెవెన్యూలోటు ఎక్కువగా ఉన్న రాష్ర్టాలకు ఎక్కువ వెయిటేజీ ఇచ్చి ఆ మేరకు నిధుల కేటాయింపును పెంచుతున్నది. ఈసారి జనాభా వెయిటేజీని తగ్గించినప్పటికీ రాష్ర్టాల సంపదను, తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం వల్ల పన్నుల వాటాగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు 2.473 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గాయి. 


ప్రగతిశీల రాష్ర్టాలకు ప్రతిబంధకాలు

సొంత వనరులతో సంపదను పెంచుకొంటు న్న తెలంగాణ వంటి రాష్ర్టాల ప్రగతికి కేంద్ర విధానాలు ప్రతిబంధకంగా మారాయి. అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించకుండా, ఆర్థికంగా గాడితప్పిన రాష్ర్టాలు కేంద్ర పన్నుల వాటాలో అధిక ప్రయోజనం పొందుతుండటం గమనార్హం. ఈ జాబితాలో జనాభా ఎక్కువగా ఉన్న యూపీ, బీహార్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ర్టాలు అగ్రభాగాన ఉన్నాయి. 


logo