గురువారం 28 మే 2020
Telangana - May 23, 2020 , 01:41:03

వచ్చే మూడ్రోజులు వడగాలులు

వచ్చే మూడ్రోజులు వడగాలులు

  • మరింత పెరుగనున్న ఎండల తీవ్రత
  • ఖమ్మంలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రం లో భానుడు భగభగ మండుతున్నాడు. ఫలితంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. శనివారం నుంచి మూడ్రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రధానంగా ఆదిలాబాద్‌, కుమ్రంభీంఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. 

44 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు

శుక్రవారం రాష్ట్రవ్యాప్తగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదైనట్టు పేర్కొన్నారు. ఖమ్మంలో 46 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీలు, భద్రాచలం, హన్మకొండలో 44 డిగ్రీల చొప్పున, హైదరాబాద్‌లో 42.7 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 44 డిగ్రీలు, మెదక్‌లో 43.8 డిగ్రీలు, నల్లగొండలో 45 డిగ్రీలు, నిజామాబాద్‌లో 44.9 డిగ్రీలు, రామగుండంలో 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.


logo