మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:39:58

ఆసిఫాబాద్‌లో 12.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

ఆసిఫాబాద్‌లో 12.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యల్పంగా 17 డిగ్రీలు

రాష్ర్టాన్ని చలి వణికిస్తున్నది. రాత్రివేళల్లో వీస్తున్న చలిగాలులతో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో క్రమంగా తగ్గుదల నమోదవుతున్నది. రాత్రి పదిగంటల నుంచే ఉష్ణోగ్రతలు పడిపోయి మంచు కురుస్తున్నది. ఉదయం 9 గంటల వరకు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదుకావడం లేదు. ఒకవైపు కరోనా భయం.. మరో వైపు పెరుగుతున్న చలి ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో అప్పుడే చలి వణికిస్తున్నది. రాత్రివేళల్లో వీస్తున్న చలిగాలులతో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో క్రమంగా తగ్గుదల నమోదవుతున్నది. అదేవిధంగా శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఇంచార్జి డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వివరించారు. చలి తీవ్రత కూడా క్రమంగా పెరుగుతున్నట్టు పేర్కొన్నారు. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 12.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది. ఆదిలాబాద్‌లో 12.8 డిగ్రీలు, జనగామలో 13.3, రాజన్న సిరిసిల్లలో 13.6, వరంగల్‌ రూరల్‌, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాల్లో 13.9, నిజామాబాద్‌లో 14.2, హైదరాబాద్‌లో 17, నల్లగొండలో 19.1 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.