శనివారం 06 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:08:57

నీటిలో 12 గంటల నరకయాతన

నీటిలో 12 గంటల నరకయాతన

  • శుక్రవారం శాభాష్‌పల్లి వంతెన పైనుంచి పడిన వ్యక్తి 
  • పిల్లర్‌ ఆసరాతో రాత్రంతా నీళ్లలోనే..
  • శనివారం ఉదయం కాపాడిన మత్స్యకారులు 

బోయినపల్లి: ఎటుచూసినా నీళ్లు.. చుట్టూ చిమ్మచీకటి.. శుక్రవారం సాయంత్రం బ్రిడ్జిపై నుంచి నీళ్లలో పడ్డ వ్యక్తి పిల్లర్‌ సలాక ఆధారంగా 12 గంటలు నీటిలో నరకయాతన అనుభవించాడు. శనివారం ఉదయం బాధితుడి కేకలు విన్న జాలర్లు అక్కడికి చేరుకొని రక్షించడంతో బతుకుజీవుడా అంటు బయటపడ్డాడు. వివరల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు చెందిన బొగ్గుల రవికి భార్య, ఇద్దరు కూతుర్లు. బతుకుదెరువు కోసం పదేళ్లకుపైగా గల్ఫ్‌ వెళ్లొచ్చాడు. తర్వాత కొంతకాలం సిరిసిల్లలో టైలరింగ్‌ చేశాడు. పెద్ద కూతురు పెళ్లి చేశాడు.

 చిన్న కూతురును డిగ్రీ చదివిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటకు వచ్చి ఇంట్లోనే టైలరింగ్‌ చేస్తున్నాడు. ఇటీవల చేయికి దెబ్బతాకగా, నెల నుంచి నగరంలోని ఓ స్వీట్‌హౌస్‌లో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఇంటి వద్దే ఉంటున్న ఆయన, శుక్రవారం బంధువుల ఇంటికని బైక్‌పై వెళ్లాడు. బోయినపల్లి మండలం శాభాష్‌పల్లి హైలెవల్‌ వంతెనపై ఆగి, వాహనాన్ని పక్కన పెట్టాడు. అక్కడ ఏం జరిగిందో కాని, బ్రిడ్జిపై నుంచి నీళ్లలో పడిపోయాడు. నీళ్లలో పడిన వెంటనే పిల్లర్‌కు ఉన్న సలాకను పట్టుకున్నాడు. భయంతో అరిచీఅరిచీ నీరసపడిపోయాడు. లాక్‌డౌన్‌ కావడంతో అటుగా ఎవరూ రాక అక్కడే ఉండిపోయాడు. 

అప్పటికే రాత్రి కావడంతో ప్రాణభయంతో వణికిపోయాడు. చుట్టూ ఆవరించిన చీకట్లో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని గడిపాడు. అలల చప్పుడు, వింత వింత శబ్ధాలతో రాత్రంతా కంటి మీద కునుకులేకుండా గడిపాడు. 12 గంటలపాటు నరకయాతన అనుభవించాడు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అటుగా వెళ్తున్న మత్స్యకార్మికుల మాటలు విని, బలాన్నంతా కూడదీసుకుని కేకలు వేశాడు. అతని అరుపులు విన్న మత్స్యకార్మికులు బండి రవీందర్‌, బండి కనుకయ్య, మరొకరు అక్కడికి వెళ్లి.. రవిని బయటకు తీసుకొచ్చారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించగా, వారు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన మత్స్యకార్మికులను గ్రామస్థులు అభినందించారు.


logo