గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 01:30:26

వినాయక విగ్రహాలకు విఘ్నాలు

వినాయక విగ్రహాలకు విఘ్నాలు

  • ధూల్‌పేటలో కానరాని తయారీ సందడి
  • కరోనాతో కళాకారులకు ఉపాధి కరువు
  • ఈ ఏడాది కోట్ల రూపాయల్లో నష్టం

పండుగలకూ కరోనా కష్టాలు తప్పడం లేదు. ప్రతి ఏటా ఆబాలగోపాలం సంబురంగా చేసుకొనే వినాయకచవితి ఈ ఏడు వెలవెల బోనున్నది. విగ్రహాల తయారీకి ఆర్డర్లు లేకపోవడంతో రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర నుంచి వచ్చిన కళాకారులు ప్రస్తుతానికి చిన్న విగ్రహాలు తయారు చేస్తున్నారు. బయానా ఇచ్చే వారు లేకపోవడంతో తయారీని సైతం తగ్గించారు. విగ్రహాల తయారీ కేంద్రాలుగా ఉన్న ధూల్‌పేట, మేడ్చల్‌ రహదారిపై సందడి కనిపించడం లేదు. వినాయక ప్రతిమల తయారీతో పరోక్షంగా ఉపాధి పొందే స్థానికులు దినసరి కూలీలుగా మారారు. కొవిడ్‌ మహమ్మారి పేద బతుకులను అస్తవ్యస్తం చేసింది.

  హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గణేశ్‌ విగ్రహాల తయారీకి ధూల్‌పేట పేరెన్నికగన్నది. ఇక్కడ తయారు చేసే విగ్రహాలు దేశ, విదేశాలకూ వెళ్తుంటాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంతో ధూల్‌పేట మూగబోయింది. పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర నుంచి కళాకారులు కుటుంబాలతో హైదరాబాద్‌కు వచ్చి ఐదు నెలల పాటు ఉండి గణేశ్‌ విగ్రహాలు తయారు చేస్తారు. ఆ తర్వాత శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గామాత విగ్రహాలను చేసి విక్రయించి.. నాలుగు డబ్బులు సంపాదించుకొని తిరిగి స్వరాష్ర్టానికి వెళ్లిపోతుంటారు. ఈ క్రమంలో స్థానికులకు ఉపాధి కల్పిస్తారు. వారికి దినసరి కూలిగా రూ. 250 నుంచి రూ. 300 చెల్లిస్తుంటారు. కాగా ఈ ఏడాది పలు వినాయక విగ్రహ తయారీ కేంద్రాలు ఇప్పటికీ తెరుచుకోలేదు. ప్రతిమల తయారీలో వినియోగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ను రాజస్థాన్‌ నుంచి, కొబ్బరిపీచును తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. కొవిడ్‌ నేపథ్యంలో రవాణా వ్యవస్థ స్తంభించి పోవడమేగాక, వాహన యాజమానులు ఎక్కువ మొత్తంలో డిమాండ్‌ చేస్తుండటంతో ముడిసరుకు తెచ్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారింది.

గతేడాది విగ్రహాలకే మెరుగులు 

మండపాల నిర్వాహకులు ప్రతి ఏటా మూడు నెలల ముందుగానే ఆర్డర్లు ఇవ్వడంతోపాటు బయానాగా కొంత మొత్తాన్ని చెల్లించేవారు. అక్కడక్కడ కొందరు రాజస్థానీ కళాకారులు విగ్రహాలు తయారు చేస్తున్నా వారికి అడ్వాన్సులు ఇచ్చే పరిస్థితి లేదు. చాలా మంది విగ్రహ తయారీదారులు ప్రతిమల తయారీ నిలిపేశారు. గతేడాది మిగిలిన విగ్రహాలకే మళ్లీ మెరుగులు దిద్దుతున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో గణేశ్‌ మండపాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నది. ప్రస్తుతం భారీ విగ్రహాలకు స్వస్తి చెప్పి కేవలం 2 అడుగుల ఎత్తులోపు తక్కువ సంఖ్యలో తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో విగ్రహాల ధర 40 శాతం మేర పెరిగే అవకాశం ఉంది.

చిన్నసైజు విగ్రహాలనే తయారు చేస్తున్నం..

మాది రాజస్థాన్‌. ఏటా గణేశ్‌ విగ్రహాల తయారీకి ఇక్కడి వస్తుంటం. నాతోపాటు చాలా మంది వచ్చేటోళ్లు. కరోనా వల్ల ఈ ఏడు నేను, మరో ఇద్దరం మాత్రమే వచ్చినం. గణేశ్‌ ఉత్సవాలు బాగా జరిగేటట్టు లేవు. అందుకే చిన్న సైజు విగ్రహాలనే తయారు చేస్తున్నం.  ఎవరూ కొనకపోతే పెట్టుబడి దండగయితది. మేమే కాదు చాలా మంది చిన్నసైజువే తయారుజేస్తున్నరు ఈసారి. రేట్లు కూడా పెరుగుతయ్‌.

- రతన్‌, కళాకారుడు, రాజస్థాన్‌ 


logo