శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 03:15:46

పంచాయతీలకు మహర్దశ

పంచాయతీలకు మహర్దశ

పీవీ నరసింహారావు హయాంలో దేశంలో వచ్చిన ప్రధానమైన చట్టం పంచాయతీ రాజ్‌కు సంబంధించినది. దేశంలో వికేంద్రీకరణ పరంగా కానీ, సామాజిక మార్పు కోణంలో కానీ ఈ చట్టం విశిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. రాజీవ్‌ గాంధీ హయాంలోనే, 1989లో ఈ చట్టం చేయడానికి 64వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టినప్పటికీ రాజ్యసభలో స్వల్ప తేడాతో వీగిపోయింది. ఆ తరువాత పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు  1993 ఏప్రిల్‌ 24వ తేదీన అమలులోకి వచ్చిన ‘రాజ్యాంగ (73వ సవరణ) చట్టం 1992’ చట్టం చరిత్రాత్మకమైనది. ఈ చట్టం ద్వారా పంచాయతీ రాజ్‌ సంస్థలకు రాజ్యాంగ హోదా లభించింది. ఈ చట్టం ద్వారా ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు రచించుకోవడానికి, సామాజిక న్యాయం సాధించడానికి పంచాయతీ సంస్థలకు అధికారాలు, బాధ్యతలు బదిలీ అయ్యాయి. సామాజిక సంక్షేమం కోసం కూడా పంచాతీలు పనిచేస్తాయి. రాజ్యాంగం పదకొండవ షెడ్యూలులో పొందుపరిచిన 29 అంశాలకు సంబంధించిన బాధ్యతలు పంచాయతీ రాజ్‌ సంస్థలకు దత్తమవుతాయి. కానీ ఈ చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన విధానాలను రాష్ర్టాలు రూపొందించుకోవలసి ఉంటుంది. 

ఈ చట్టం ప్రకారం- అన్ని రాష్ర్టాలలోని ప్రతి గ్రామంలో గ్రామసభను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. దీనిద్వారా పంచాయతీ సంస్థకు జవాబుదారీతనం ఏర్పడుతున్నది.  పంచాయతీ రాజ్‌ సంస్థలకు ప్రతి ఐదేండ్లకు క్రమబద్ధంగా ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. పన్నులు, సుంకాలు విధించుకోవచ్చు. మూడోవంతు స్థానాలను మహిళలకు కేటాయించవలసి ఉంటుంది. చైర్‌పర్సన్స్‌కు కూడా ఈ రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ఈ చట్టం వల్ల పంచాయతీ సంస్థలకు చట్టబద్ధత లభించడంతోపాటు ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చినట్టయింది. గ్రామస్థాయిలో ప్రజాస్వామ్య ప్రక్రియ అమలు చేయడానికి అవకాశం ఏర్పడింది. పంచాయతీ సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించే అవకాశం లేకుండా పోయింది. logo