శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Apr 09, 2020 , 01:57:36

కేసులు యువతలో.. మరణాలు వృద్ధుల్లో కంత్రీ కరోనా

కేసులు యువతలో.. మరణాలు వృద్ధుల్లో కంత్రీ కరోనా

  • యువజనం రహస్య వాహకులుగా మారే ముప్పు 
  • వారికి వ్యాధి ఉన్న సంగతి వారికే తెలియని స్థితి
  • ప్రభావితమవుతున్న వృద్ధులు, దీర్ఘకాల రోగులు
  • కరోనా వైరస్‌ వ్యాప్తి తీరుపై అధ్యయనాల్లో వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మేము యువకులం.. కరోనా మమ్మల్ని ఏమీ చేయదు అని అనుకునే యువత పారాహుషార్‌! కొందరి  శరీరంలోని రోగనిరోధకశక్తి కరోనాతో పోరాడటం వల్ల వారు ఆ వ్యాధి వల్ల ప్రభావితం కాకపోవచ్చు. కానీ వారి మూలంగా వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు కరోనాకు గురై మృత్యువాత పడే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా, తెలంగాణలో కరోనాకు గురవుతున్న రోగులు, మృతులపై జరిపిన అధ్యయనాల్లో ఇదే విషయం వెల్లడవుతున్నది. కరోనా రోగుల్లో యువత అధిక సంఖ్యలో ఉండగా, మృతుల్లో వయోవృద్ధులు, దీర్ఘకాలిక రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. చాలామందిలో వ్యాధి లక్షణాలు లేకపోయినప్పటికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నారు. యువత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమకు తెలియకుండానే ఇతరులకు వ్యాధి వ్యాప్తిచేసే ముప్పు ఉన్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల యువత కరోనాపట్ల అలక్ష్యం చూపితే తీవ్రపరిణామాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉన్నది.

వ్యాధిగ్రస్థుల్లో 60శాతం మంది యువకులే

రోగనిరోధకశక్తి ఉన్నవారు కరోనాను జయించినట్టు వార్తలు వెలువడటంతో యువత నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నారు. వారి నిర్లక్ష్యం ఇతరులకు ముప్పుగా పరిణమిస్తున్నది. స్వయంగా వారు వైరస్‌ బారిన పడటమే కాకుండా ఇతరులకు దానిని అంటిస్తున్నారు. ఈ అలసత్వంతో దేశంలో కరోనా మూడోదశకు దారితీయవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఈ నెల 2వ తేదీ నాటికి కరోనా సోకినవారిలో 60 శాతం కంటే ఎక్కువమంది 20 నుంచి 49 ఏండ్లలోపు వారే ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. వీరిలో 73 శాతం మంది యువకులుండగా, 27 శాతం మంది యువతులున్నారు. 

అయితే వీరిలో చాలామందిలో కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో వీరికారణంగా చాపకింద నీరులా వైరస్‌ విస్తరిస్తున్నది. వారి కారణంగా వయోవృద్ధులు, దీర్ఘకాలిక రోగులు వైరస్‌ బారినపడుతున్నారు. దేశంలో సంభవిస్తున్న మరణాల సంఖ్యలో వృద్ధులు, దీర్ఘకాలిక రోగులే అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఇటువంటి కేసులు తాజాగా నమోదైనట్టు ఆ జిల్లా కలెక్టర్‌ సీ నారాయణరెడ్డి తెలిపారు. ఇటీవల ఒక వ్యక్తి గొంతునొప్పితో నిజామాబాద్‌లోని జీజీహెచ్‌ దవాఖానకు వచ్చి చికిత్స అందించేలోపే మరణించాడని చెప్పారు. అతడు విదేశాలనుంచి రాలేదు, విదేశాలనుంచి వచ్చినవారిని కలువలేదన్నారు. ‘ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన 16 మందికి పరీక్షలు చేశాం. వారిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవు. కానీ అందరికీ కరోనా పాజిటివ్‌ అని వెల్లడైంది. వీరందరూ యువకులే. వారికి దగ్గులేదు, తుమ్ము రాదు. కానీ వారి కారణంగా వైరస్‌ దీర్ఘకాలిక రోగులకు వెంటనే సోకుతుంది’ అని కలెక్టర్‌ వివరించారు.  

మృతుల్లో మధుమేహం, బీపీ రోగులే అధికం

కరోనా వైరస్‌ మధుమేహం, రక్తపోటు, ఆస్తమా వంటి దీర్ఘకాల వ్యాధులున్నవారిని త్వరగా ప్రభావితం చేస్తున్నట్టు వైద్యనిపుణులు జరుపుతున్న అధ్యయనాల్లో వెల్లడైంది. కరోనాబారిన పడుతున్న ఈ రోగుల్లోనే మరణాల రేటు అధికంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల్లో హృద్రోగ సమస్య ఉన్నవారు అత్యధికంగా ఉన్నారు. ఆ తరువాతి స్థా నాల్లో మధుమేహం, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్థులున్నారు. నాలుగోస్థానంలో అధిక రక్తపోటు, చివరిస్థానంలో క్యాన్సర్‌ రోగులు ఉన్నారు. భారత్‌లో సంభవిస్తున్న కరోనా మరణాల్లో మధుమేహం రోగులు మొదటిస్థానంలో ఉండ గా, ఆ తరువాత రక్తపోటు, హృద్రోగులు, శ్వాసకోశ సంబంధిత రోగులు ఉన్నారు. 

60 దాటినవారు జాగ్రత్త

కరోనా వయోధికులపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతున్నది. భారత్‌లో సంభవిస్తున్న కరోనా మరణాల్లో 60, ఆపైన వయస్కులే అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అదే పాశ్చాత్యదేశాల్లో 80, ఆపైన వయస్కులు కరోనా వల్ల మరణిస్తున్నారు. దేశంలో ఈ నెల ఆరో తేదీ వరకు నమోదైన 4,097 పాజిటివ్‌ కేసులు, 109 మరణాలపై జరిగిన అధ్యయనంలో.. మృతుల్లో 60, ఆపైన వయస్కులే ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మృతుల సగటు వయస్సు 20 ఏండ్లు తక్కువగా ఉంది. ఇటలీ తదితర పాశ్చాత్య దేశాల్లో కూడా మృతుల సగటు వయస్సు 70 నుంచి 80 మధ్య ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ రోగులు, మృతుల వయో పరిమితిని విశ్లేషించగా, 80 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు 26.4 శాతం ఉన్నారు. భారత్‌లో పాజిటివ్‌ రోగులు, మృతుల్లో 60, ఆ పై వయస్కులు 8.9 శాతం మంది ఉన్నారు. ఈ నెల 6 నాటికి చోటుచేసుకున్న 109 మరణాల్లో 69 మంది 60 ఏండ్లు దాటిన వారుండటం గమనార్హం.

వయసు
పాజిటివ్‌ కేసులు
మరణాలు
మరణాల  రేటు
40 కంటే తక్కువ
1,911080.4 
40-60
1,383
33
2.4
60 కంటే ఎక్కువ
773
69
8.9
మగవారు
3,091
80
2.6
ఆడవారు
976
29
3.0
మొత్తం
4,067
109
2.7

109 మంది మృతుల్లో..

  • 56 శాతం మందికి మధుమేహం ఉండగా, 47 శాతం మందికి రక్తపోటు ఉంది. 
  • ఈ రెండూ ఉన్నవారు 86 మంది ఉన్నారు. 
  • ప్రతి ఐదుగురిలో ఒకరు ఆస్తమా లేదా శాస్వకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
  • 16 శాతం మందికి హృద్రోగ సమస్యలు ఉన్నాయి.
  • మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలున్నవారు చాలా తక్కువ


logo