శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 02:15:11

హైకోర్టు రాజకీయ జిమ్మిక్కుల వేదిక కాదు

హైకోర్టు రాజకీయ జిమ్మిక్కుల వేదిక కాదు

  • సీఎం ఆరోగ్య వివరాలు కోరిన పిటిషనర్‌కు చీవాట్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజకీయ జిమ్మిక్కులకు హైకోర్టును వేదికగా మారనివ్వబోమని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. సీఎం కేసీఆర్‌ ఆరోగ్య వివరాలు కోరుతూ నవీన్‌కుమార్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు హైకోర్టు నిరాకరించింది. శుక్రవారం ఉద యం కేసుల ప్రస్తావన సమయంలో తా ము 8వ తేదీన పిటిషన్‌ దాఖలు చేశామని, ఇంకా విచారణకు రాలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను లంచ్‌ మోషన్‌లో విచారణకు స్వీకరించాలని చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ‘ముఖ్యమంత్రి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. ఆయన ఆరోగ్యం గురించిన ఏదైనా సమాచారం ఉంటే అధికార వర్గాలు సమయానుగుణంగా తెలియజేస్తాయి. ఈ అంశంలో అత్యవసరం ఏమున్నది? ’ అని ప్రశ్నించింది. ‘నా కోర్టును రాజకీయ జిమ్మిక్కులకు వేదిక కానివ్వను. ప్రస్తుతం అత్యవసర కేసులు నిబంధనల ప్రకారం లిస్ట్‌ అయితేనే విచారణ చేపడుతాం’ అని చీఫ్‌ జస్టిస్‌ ఘాటుగా స్పందించారు. 

నవీన్‌కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు

నారాయణపేట రూరల్‌ : సీఎం కేసీఆర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నవీన్‌కుమార్‌పై నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామానికి చెందిన కావలి వెంకటేశ్‌ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీన్‌కుమార్‌ ఓ యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించి ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.


logo