శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:51:49

‘ఆన్‌లైన్‌'పై నిర్ణయం తీసుకోండి

‘ఆన్‌లైన్‌'పై నిర్ణయం తీసుకోండి

  • ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేశామన్న సర్కారు 
  • త్వరలో తుది నోటిఫికేషన్‌ ఇస్తామని ధర్మాసనానికి వివరణ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానాలను సమర్పించాలని ఆదేశించింది. ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడంపై హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదని, విద్యా సంవత్సరాన్ని ఇంకా ప్రారంభించలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. 

ఈ అంశంపై నియమించిన కమిటీ ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదలచేసిందని, తుది నోటిఫికేషన్‌ ఇంకా విడుదల  కావాల్సి ఉన్నదని వివరించారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులు మినహా ప్రత్యామ్నాయం లేదని ప్రైవేటు స్కూల్స్‌ యాజమాన్యాల తరఫు న్యాయవాది ఆదినారాయణరావు పేర్కొన్నారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఆన్‌లైన్‌లో బోధిస్తున్నారని, ఆన్‌లైన్‌లో బోధించే అంశాలు పరీక్షల్లో రావని, సిలబస్‌ను తగ్గించామని అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. అన్నివర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. పరీక్షల్లో కనిపించని అంశాలపై ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించి ఏంలాభమని ప్రశ్నించింది. ఆన్‌లైన్‌ తప్ప మరోమార్గం లేదన్న ప్రైవేటు యాజమాన్యాల వాదనపై ధర్మాసనం స్పందిస్తూ.. ఆరేండ్ల పిల్లలు లాప్‌ట్యాప్‌ ఎదుట ఎంతసేపు కూర్చోగలరని ప్రశ్నించింది. అదేసమయంలో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావాలా వద్దా? అనేది తల్లిదండ్రులు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులపై తగిన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదావేసింది. 

కరోనా చికిత్సను వికేంద్రీకరించాలి

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న గాంధీ దవాఖానపై భారాన్ని తగ్గించడానికి వైద్యసౌకర్యాల వికేంద్రీకరణ చేపట్టాలని హైకోర్టు సూచించింది. బోధన వైద్యశాలలు, కేంద్ర ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్‌ చికిత్స అందించాలని డాక్టర్‌ శ్రీవాత్సవ్‌ వేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మిలిటరీ, రైల్వే తదితర దవాఖానల్లో కరోనాకు చికిత్స ఉన్నదా అని ప్రశ్నించింది. హైదరాబాద్‌లోని సరోజినీదేవి, ఈఎస్‌ఐ వైద్యశాలల్లో కేవలం పరీక్షలు మాత్రమే నిర్వహిస్తూ కొవిడ్‌-19 చికిత్స అందించకపోవడంపై హైకోర్టు వివరణ కోరింది. పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ మంగళవారం విచారణకు హాజరుకావాలని సూచించింది. రాష్ట్రంలో 21 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్‌ హాస్పిటల్స్‌లో కొవిడ్‌-19 చికిత్స అందుబాటులో ఉన్నదని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ హైకోర్టుకు సమర్పించిన రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 13 ప్రభుత్వ దవాఖానలు, ప్రభుత్వ బోధన వైద్యశాలల్లోనూ వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు.  

రవికుమార్‌ మృతిపై నివేదిక ఇవ్వండి 

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో వెంటిలేటర్‌ లేక రవికుమార్‌ అనే వ్యక్తి చనిపోయినట్టు వీడియో వైరల్‌ అవుతున్నదని, దానిపై నివేదిక ఇవ్వాలని సోమవారం ఆ దవాఖాన సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అధికారులకు నోటీసులు జారీచేస్తూ.. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. logo