గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 02:40:14

‘మొక్క’వోని దీక్ష

‘మొక్క’వోని దీక్ష

  • పల్లెల్లో పరుచుకున్న పచ్చదనం
  • హరితహారం లక్ష్యం 81% పూర్తి 
  • ఆరు జిల్లాల్లో వందశాతానికి పైగా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పల్లెల్లో పచ్చదనం పరుచుకుంటున్నది. హరితహారం లక్ష్యాన్ని పోటీ చేయడంలో పల్లెలు మొక్కవోని దీక్షతో మున్ముందుకు సాగుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురువటం, కరోనా నేపథ్యంలో ఉపాధికూలీలు ఎక్కువ సంఖ్యలో పనుల్లోకి రావడంతో మొక్కలు నాటే ప్రక్రియ వేగంగా సాగింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో లక్ష్యానికి మించి మొక్కలు నాటడం విశేషం.  ఆరోవిడత హరితహారం కింద ఈ ఏడాది గ్రామాల్లో 12.67 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఆగస్టు 31 నాటికి 10.23 కోట్ల మొక్కలు నాటడం పూర్తయ్యింది. 

6 జిల్లాల్లో ఆగస్టు తొలివారంలోనే

ఆరు జిల్లాలు ఆగస్టు తొలివారం నాటికే 100శాతం హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేశాయి. 120%తో వికారాబాద్‌ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలువగా.. కామారెడ్డి 115%, ఖమ్మం, ములుగు 103%, జయశంకర్‌ భూపాలపల్లి 102%, భద్రాద్రి కొత్తగూడెం 100% లక్ష్యాన్ని పూర్తి చేశాయి. కరీంనగర్‌ 93%, జనగామ 91%, జగిత్యాల 90% లక్ష్యాన్ని పూర్తిచేయగా మరో 9 జిల్లాలు 80శాతానికి మించి, ఏడు జిల్లాల్లో 70శాతానికిపైగా మొక్కలు నాటారు. నల్గొండ 54%, రంగారెడ్డి 59%తో వెనుకబడ్డాయి. మిగిలిన జిల్లాలు 60% లక్ష్యం చేరుకున్నాయి.


logo