మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 16:16:15

హరిత తెలంగాణకు బాటలు వేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్

హరిత తెలంగాణకు బాటలు వేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్

రంగారెడ్డి : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత తెలంగాణకు బాటలు వేస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక హరిత ఉద్యమంలా దేశ వ్యాప్తంగా విస్తరించడం శుభ పరిణామం అన్నారు. జిల్లాలోని కొత్తూరు మండల పరిధిలో గల వైఎం తండాలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. సివిల్స్ రైట్స్ డే ను పురస్కరించుకొని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి మంత్రి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు ఆస్థి పాస్తులు ఇవ్వకున్నా స్వచ్ఛమైన గాలి అందించాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి ఏటా తెలంగాణ వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారని అన్నారు. దాని ప్రతి ఫలమే నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. జంగల్ బచావో -జంగల్ బడావో కార్యక్రమంలో భాగంగా 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచే లక్ష్యం తో కార్యక్రమం కొనసాగుతుందన్నారు.


ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మంచి స్పందన వచ్చిందన్నారు. దేశ వ్యాప్తంగా ఛాలెంజ్ ను స్వీకరించి అనేక మంది మొక్కలు నాటుతున్నారని ఎంపీని మంత్రి ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, విప్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్, ఎస్సీ, ఎస్టీ కమిషన్  సభ్యులు రాంబాల్  నాయక్, విద్యాసాగర్, నీల దేవి, దేవయ్య, చిలకమర్రి నరసింహ, అధికారులు  పాల్గొన్నారు.



logo