గురువారం 28 మే 2020
Telangana - May 13, 2020 , 01:52:31

అంగట్లో సరుకుపోసి ఆగం కావొద్దు

అంగట్లో సరుకుపోసి ఆగం కావొద్దు

  • అమ్ముడుపోయే సరుకే పండించాలి
  • ఏ పంట వేస్తే లాభమొస్తదో ప్రభుత్వమే చెప్తుంది: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటుధర రాకపోవడానికి ప్రధాన కారణం.. అందరూ ఒకే రకమైన పంటలు సాగుచేయడమేనని సీఎం కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా.. మార్కెట్లో పరిస్థితులకు తగ్గట్లుగా ఆయా పంటలను పండించాలని సూచించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో వ్యవసాయంపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ‘మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గట్టు పంటలు పండించాలన్న మాటను నేను ఇవాళే చెప్పడంలేదు.. 20 ఏండ్ల క్రితం రవాణాశాఖ మంత్రిగా పనిచేసినప్పటి నుంచి చెప్తున్నా. 

ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర వ్యవసాయశాఖ మాజీమంత్రి రాధామోహన్‌సింగ్‌కు పంటల మార్పిడి, క్రాప్‌ కాలనీల ఏర్పాటు గురించి అనేకమార్లు చెప్పాను. ఇంతకుమించిన గత్యంతరంలేదు. అందరూ ఒకే పంటవేసే విధానం పోయితీరాలి.  ఏది పడితే అది పండించి, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు పంటలు వేసి, పండిన పంటలు మార్కెట్‌కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరు. అంగట్ల సరుకు పోసి ఆగం కావద్దు. డిమాండ్‌ ఉన్న పంటలే సాగుచేయాలి. అమ్ముడుపోయే సరుకే పండించాలి’ అని అన్నారు.

 ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ర్టాల్లో  వెయ్యి రూపాయలకు కూడా ఎవరూ పంటను కొనడంలేదని, అన్నదాతలకు కనీస గిట్టుబాటు ధర లభించడం లేదని తెలిపారు. ‘రైతులు ఏ పంట వేస్తే లాభపడతారో ప్రభుత్వమే పూనుకుని చెప్తున్నది. ఆ పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్తున్నది. ప్రభుత్వం ఇంత చొరవ చూపుతుంటే రైతులకు ఇంకా వేరే ఆలోచన ఎందుకుండాలి? రైతుల ఆలోచనలో మార్పురావాలి. నిర్మాణాత్మకమైన మార్పులు రావాలి’ సీఎం పేర్కొన్నారు. ఇది రైతుల మీద ఆంక్షలు పెట్టడం కాదని, వారికి మరింత లాభంచేయడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని అని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. 


logo