బుధవారం 03 జూన్ 2020
Telangana - May 10, 2020 , 15:00:27

ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్నదే  ప్రభుత్వ లక్ష్యం

నిర్మల్ : రాష్ట్రంలోని ప్రజలంతా క్షేమంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని  రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు  ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది  నిమిషాల పాటు ఇండ్లలో ఉన్న నిల్వ నీటిని తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మంత్రి తన నివాసం లో కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉన్న బావిలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. పాత టైర్లలో, పూల కుండీలలో నిల్వ ఉన్న నీరు, ఖాళీ స్థలంలో నిల్వ ఉన్న నీరు, పాత పైపులను తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు విష జ్వరాల వంటి వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమలను లార్వా దశలోనే అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలోని కూలర్లు, పనికిరాని టైర్లు, పూల కుండీలు, పాత్రలలో ఉన్న నిల్వ నీటిని ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పదినిమిషాలు 10 వారాల పాటు తొలగించాలని మంత్రి అన్నారు. 

జిల్లాలోని ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు , ప్రజా ప్రతినిధులు  తమ ఇండ్లలో పాత్రల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి ప్రజలకు స్ఫూర్తిగా నిలవాలన్నారు . అలాగే ప్రతి ఒక్క కౌన్సిలర్ తమ వార్డు పరిధి లోని ప్రతి ఇంటికి వెళ్లి ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని చేపట్టి వ్యాధులు దరి చేరకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.


logo