శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 20:18:58

మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం : మంత్రి ఈశ్వర్‌

మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం : మంత్రి ఈశ్వర్‌

జగిత్యాల : మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్‌లో మహిళా సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో మహిళా సంఘాలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సహజ బ్రాండ్‌ పేరుతో మార్కెటింగ్ చేయనున్నట్లు తెలిపారు. సహజ బ్రాండ్‌ను పైలెట్ ప్రాజెక్టుగా జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలోని  మహిళా సంఘాల్లో లక్షా 60వేల మంది సభ్యులుగా ఉన్నారు. వారు బ్యాంకుల రుణాలు తీసుకుని చెల్లించడమే కాకుండా సంఘాలకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో వస్తు తయారీని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

‘గతంలో ఎస్టీశాఖ ఆధ్వర్యంలో గిరి బ్రాండ్ పేరుతో అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు శ్రీకారం చుట్టాం. గిరి ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ఇదేరీతిలో మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను సహజ బ్రాండ్ పేరుతో మార్కెటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నాం’  అని మంతి తెలిపారు.  కార్యక్రమంలో కలెక్టర్ జీ  రవి, ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం సంజయ్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ దావ వసంత, డీఆర్డీఏ పీడీ లక్ష్మీనారాయణ, జిల్లా సమాఖ్య అద్యక్షురాలు వనితా మంజుల, వివిధ సంఘాల మహిళలు, అధికారులు,  ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.