సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 02:11:58

మావోయిస్టుల ఆటలు సాగవు

మావోయిస్టుల ఆటలు సాగవు

  • హరిభూషణ్‌, దామోదర్‌ విలాసజీవితం
  • బ్లాక్‌మెయిల్‌ దందాలను సహించబోం
  • తెలంగాణలో రీ ఎంట్రీని తిప్పికొడతాం
  • ప్రజల్లో అలజడి సృష్టిస్తే ఊరుకునేదిలేదు
  • డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరిక

భద్రాద్రి కొత్తగూడెం/ములుగు, నమస్తే తెలంగాణ: తెలంగాణలో మావోయిస్టుల ఆటలు సాగనివ్వబోమని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలైన హరిభూషణ్‌, దామోదర్‌ విలాస జీవితం గడుపుతూ అమాయక గిరిజనులను బలి పశువులను చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోకి మళ్లీ ప్రవేశించి ప్రజల్లో అలజడి సృష్టించాలని చూస్తే ఊరుకోమన్నారు. శనివారం ములుగు, భదాద్రి కొత్తగూడెం జిల్లాల్లో డీజీపీ పర్యటించి, పరిస్థితులను సమీక్షించారు.  మొదట ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలోని వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌లో ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు చెందిన పోలీసు అధికారులతో డీజీపీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నేండ్లుగా మావోయిస్టులు ఎంతోమంది ప్రముఖులకు లేఖలురాస్తూ.. వారినుంచి డబ్బులు వసూలుచేస్తున్నార చెప్పారు. డాక్టర్లు, ఇంజినీర్లు, వ్యాపారవేత్తలను మావోయిస్టులు బెదిరించి డబ్బులు వసూలు చేయాలనే ప్రయత్నాలను పోలీసులు తిప్పికొడుతున్నారని చెప్పారు. అభివృద్ధి నిరోధకులైన మావోయిస్టులకు ఎవ్వరూ సహకరించద్దని సూచించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సింగరేణిలో ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లా పోలీసు అధికారులతో తీవ్రవాద నిరోధక చర్యలపై సమీక్షించి, మీడియాతో మాట్లాడారు. కొన్నేళ్లుగా రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉందని, అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. ఇలాంటి మంచి వాతావరణం ఉన్న సమయంలో మావోయిస్టులు మళ్లీ అశాంతి నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అమాయకులైన ఛత్తీస్‌గఢ్‌ గిరిజనులను ఇక్కడకు పంపించి, వారితో నేరాలు చేయించి ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారని డీజీపీ చెప్పారు. మావోయిస్టుల రీ ఎంట్రీని తెలంగాణ పోలీసులు దృఢంగా ఎదుర్కొంటున్నారని అన్నారు. వారి ఎత్తుగడులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ముందుకుసాగుతున్నారన్నారు. ఆదివాసీలు మావోయిస్టుల మాటలు నమ్మవద్దని, సక్రమ మార్గాల గురించి ఆలోచించాలని సూచించారు. ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలకు పాల్పడే మావోయిస్టులకు త్వరలోనే గట్టి సమాధానం చెబుతుందని హెచ్చరించారు.  కార్యక్రమాల్లో అడిషనల్‌ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఐజీలు నాగిరెడ్డి, ప్రభాకర్‌రావు, వరంగల్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌, మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, మణుగూరు ఏఎస్పీ శబరీశ్‌, భద్రాచలం ఏఎస్పీ రాజేశ్‌చంద్ర పాల్గొన్నారు.

మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్‌!

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: సీపీఐ(మావోయిస్టు) పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని శనివారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది.  రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్‌ అలియాస్‌ యాపా నారాయణ ఎన్నికయ్యారు. పుల్లూరి ప్రసాద్‌ పర్యవేక్షణలో రాష్ట్ర కమిటీ పనిచేయనున్నట్లు సమాచారం. సభ్యులుగా బండి ప్రకాశ్‌, దామోదర్‌, భాస్కర్‌, సాంబయ్య, కంకణాల రాజిరెడ్డి ఎన్నికైనట్లు తెలిసింది.logo