శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 02:44:19

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 2% పెంపు

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 2% పెంపు

  • ఆర్డినెన్స్‌ జారీ చేసిన ప్రభుత్వం
  • 15వేల కోట్ల వరకు రుణం పొందే చాన్స్‌

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మించి అదనంగా రెండు శాతం రుణం తెచ్చుకోవడానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేసింది.. ఈ మేరకు మంగళవారం గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ తరఫున న్యాయశాఖ కార్యదర్శి ఏ సంతోష్‌రెడ్డి గెజిట్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో రూ.15వేల కోట్ల వరకు అదనపు రుణం తెచ్చుకొనే అవకాశం ఏర్పడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఈ ఏడాది రాష్ర్టానికి రావాల్సినంత ఆదాయం రాలేదు. మరోవైపు రాష్ర్టానికి రావాల్సిన పన్నుల వాటాలో కేంద్రం కోత విధించింది. 

ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో పరిమితికి మించి రూ.1,435 కోట్ల రుణాన్ని అదనంగా తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు ఉచిత బియ్యం, నగదు పంపిణీ, వలస కార్మికులకు రైళ్లు వంటి ఉపశమన చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఈ నేపథ్యలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా వల్ల ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో.. జీఎస్డీపీలో రెండు శాతం అదనపు రుణాన్ని పొందే సదుపాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం వరకు కల్పించింది. ఇందుకు తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీ చట్టం, 2005కు అవసరమైన సవరణలు చేయాలని తెలిపింది. ఈ మేరకు సవరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేసింది. ఈ ఆర్డినెన్స్‌ ఈ ఏడాది జనవరి నుంచి అమలులోకి వస్తున్నట్టు గెజిట్‌లో పేర్కొన్నది. 


logo