సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 18:01:25

తెలంగాణ వచ్చాకే చేనేతకు పూర్వ వైభవం

తెలంగాణ వచ్చాకే చేనేతకు పూర్వ వైభవం

మహబూబ్ నగర్ : చేనేత పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న ఎక్స్ పో ప్లాజాలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో చేనేత పరిశ్రమకు మంచి పేరు ఉండేదని, అగ్గిపెట్టెలో సైతం పట్టేలా చీరలను నేసిన ఎందరో గొప్ప చేనేత కార్మికులకు ఈ ప్రాంతం పుట్టినిల్లన్నారు.

రాను రాను చేనేతకు ఆదరణ తగ్గిందన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చేనేతను, చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం నడుంబిగించిందనిన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి సోమవారం అందరూ చేనేత వస్త్రాలు ధరిస్తున్నారని తెలిపారు. క్రమంగా చేనేతకు పూర్వ వైభవం వస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. గద్వాల, కొత్తకోట, నారాయణపేట చీరలు ఎంతో ప్రఖ్యాతిగాంచినవని తెలిపారు. మహబూబ్ నగర్ ఎక్స్ పో ప్లాజాలో చేనేత ప్రదర్శనల ద్వారా ప్రజలను చేనేతపై మక్కువ కలిగేలా చూడాలన్నారు. 


చేతి వృత్తులు, చేనేత సజీవంగా ఉండేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. మహబూబ్ నగర్ ఎక్స్ పో  ప్లాజాలో చేనేత, హస్తకళల ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రదర్శన, అమ్మకానికి ఉంచాలని, పట్టణంలోని ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న వారందరూ ఈ ప్రదర్శనకు వచ్చి  కొనుగోలు చేసేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూర్ లను కలిపి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కు విన్నవించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా ఆదేశించారని వివరించారు.

అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు సానుకూల స్పందన తెలిపిన ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. వెంకట రావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, డిసీసీబీ  వైస్ చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు గోవిందప్ప పాల్గొన్నారు.logo