సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 23:53:18

ఆశల వరద పారేనా!

ఆశల వరద పారేనా!

  • గతేడాది మాదిరే కృష్ణాలో మొదలైన వరద
  • ఆల్మట్టికి 62వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో
  • వంద టీఎంసీలు దాటితేనే కర్ణాటక దాటనున్న కృష్ణమ్మ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులకు ముఖద్వారమైన ఆల్మట్టికి నాలుగైదు రోజులుగా వరద పెరుగుతున్నది. ప్రస్తుతం 62 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది.129.72 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యమున్న ఈ జలాశయంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు 26 టీఎంసీల మేర వరద వచ్చిచేరింది. దీంతో నీటినిల్వ 52 టీఎంసీలకు పెరిగింది. ఆల్మట్టిలో ఇంకా 78 టీఎంసీలు, నారాయణపూర్‌లో 14 టీఎంసీలకుతోడు, సాగునీటి వినియోగం, ఇతర రిజర్వాయర్లకు నీటి తరలింపు కలిపి మొత్తం 100 టీఎంసీలు దాటితే  తప్ప కృష్ణాజలాలు కర్ణాటకను దాటి దిగువకు వచ్చే ఆస్కారంలేదు. తెలుగు రాష్ర్టాల్లో కృష్ణా బేసిన్‌కు మిగిలిన మార్గాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగాలేదు. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 5.85 టీఎంసీల నిల్వ మాత్రమే ఉన్నది. 3,500 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఉజ్జయిని నిండి దిగువన భీమా ద్వారా వరద రావాలంటే ఇంకా 65 టీఎంసీలు నిండాకే అవకాశం ఉన్నది.

గతేడాది 1900 టీఎంసీల దాకా

కృష్ణా బేసిన్‌లో గతేడాది భారీ వరదలు నమోదయ్యాయి. ఎగువన కర్ణాటక ప్రాజెక్టులన్నీ నిండి.. జూన్‌ 30 నాటికి జలాలు జూ రాలను తాకాయి. ఆపై కొన్నిరోజులకే భీమా తోడవడం.. శ్రీశైలానికి నేరుగా తుంగభద్ర కలిసి రావడంతో రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి.  కాగా, 797.12 టీఎంసీలుసముద్రంలోకి వెళ్లాయి. తెలుగు రాష్ర్టాలు దాదాపు వెయ్యి టీఎంసీలను వినియోగించుకున్నాయి.  


logo