సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 02:50:07

అలివిగాని వల

అలివిగాని వల
  • శ్రీశైలం రిజర్వాయర్‌లో చిక్కుతున్న మన చేపపిల్ల
  • అలివి వల దాడికి తెలంగాణ మత్స్యకారులు విలవిల
  • ప్రభుత్వం వదిలిన చేపలు ఆంధ్రా దళారుల పాలు
  • జిల్లా పరిధిలోనే 29 లక్షల చేపపిల్లలు
  • మత్స్య, పోలీసు, రెవెన్యూ అధికారులు
  • లేక రోడ్డున పడుతున్న మత్స్యకారులు

పెద్ది విజయభాస్కర్‌, మహబూబ్‌నగర్‌  ప్రధాన ప్రతినిధి/ నమస్తే తెలంగాణ: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా.. శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణానది బ్యాక్‌వాటర్‌ పరిధిలో ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం వేసిన చేపలన్నీ ఆంధ్ర దళారుల పాలవుతున్నాయి. దాదాపు కిలోమీటర్‌ పొడవున్న అతి పెద్ద అలివి వలలను వేసి ఒక్కసారిగా నదిలో ఉన్న చేపలన్నింటినీ దోచుకుపోతున్నారు. అలివి వలలను చూస్తేనే మన సంప్రదాయ మత్స్యకారులు హడలిపోతున్నారు. ఆ వల వారి ఉపాధిని నాశనం చేస్తున్న యమపాశంగా కనిపిస్తున్నది. అలివి, పట్టు వలలపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ వాటి వాడకం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నది. నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల పరిధిలో అనేక గ్రామాల్లో మత్స్యకారుల దుస్థితి అలవికానిదిగా మారింది. సంప్రదాయ చేపల వలలు, పుట్టీలు ఐస్‌బాక్సులు అటకెక్కాయి.


 మోపెడ్లు, ఆటోలు మూలనపడ్డాయి. పనిలేక.. పస్తులుండలేక తెలంగాణ జాలర్ల జీవితాలు అల్లాడిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నదులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు.. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేపపిల్లలను వదిలి మత్స్యకారుల సంపదను పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నది. ఇందులో భాగంగానే శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణానది బ్యాక్‌వాటర్‌లో కూడా లక్షల్లో చేపలను వదిలింది. ఆంధ్ర దళారులు ఈ చేపల సంపదపై కన్నేశారు. స్థానిక దళారులతో కుమ్మక్కై.. చేప గుడ్డును కూడా విడిచిపెట్టనంత దట్టంగా.. దిట్టంగా ఉండే అలివి వలలను వినియోగించి చిన్నచేప పిల్లలతోపాటు సర్వం దోచేస్తున్నారు. నదిలో విడిచిన చేపపిల్లలను పెరుగకముందే తరలిస్తున్నారు. ఔషధాలలో వినియోగానికి అమ్మేస్తున్నారు. ఈ దోపిడీ గురించి అధికారులకు ఫిర్యాదుచేస్తే పట్టించుకొనేవారే లేరు.    


అలవిమాలిన దోపిడీ

వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల పరిధిలో చిన్నంబావి మండలపరిధి నుంచి కొల్లాపూర్‌ దాకా అక్కడినుంచి శ్రీశైలం వరకు శ్రీశైలంబ్యాక్‌ వాటర్‌ అపార మత్స్యసంపదకు ప్రసిద్ధి. కేసీఆర్‌ సర్కారు ప్రవేశపెట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా లక్షల సంఖ్యలో చేప పిల్లలను నదిలో వదులుతున్నారు. కానీ, చిన్నంబావి మండలం వెల్టూరు, కొప్పునూరు, కాలూరు, చెల్లెపాడు, వెంకటాంపల్లి, మల్లేశ్వరం, మంచాలకట్ట, సోమశిల, అమరగిరి, ఎల్లూరు నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు నదిలోని చేపలవేటలో సామాన్య మత్స్యకారులు కనిపించరు. అంతా అలివి వలలను పట్టుకుని ఉన్నవారే కనిపిస్తారు. నిషేధిత అలివి, పట్టు వలలతో మత్స్యసంపదను దళారులు, ఆంధ్ర జాలర్లు కొల్లగొడుతున్నారు. ఇదే వృత్తిపై ఆధారపడిన స్థానిక మత్స్యకారులు మాత్రం ఉపాధి కోల్పోతున్నారు. ఇంత బాజాప్తాగా దోపిడీ జరుగుతున్నా.. స్థానిక మత్స్య, పోలీసు, రెవెన్యూశాఖల అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని, ఫిర్యాదు చేసేందుకు వెళ్తే బెదిరించి వెళ్లగొడుతున్నారని జాలర్లు బాధపడుతున్నారు. స్వరాష్ట్రం సాధించుకొన్న తర్వాత కూడా ఆంధ్ర దోపిడీ కొనసాగడంపై ఎల్లూరు, అమరగిరి, సోమశిల, మల్లేశ్వరం, వెల్టూరు, కొప్పునూరు, కాలూరు, చెల్లెపాడు, వెంకటాంపల్లి, మల్లేశ్వరం, మంచాలకట్ట, చెల్లెపాడ్‌, పెద్ద మారూర్‌, గడ్డ బస్వాపూర్‌, బెక్కెం గ్రామాల ప్రజలు వాపోతున్నారు. 


ఆంధ్ర నుంచి వలసలు

ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రకాశం, చీరాల, కాకినాడ, వైజాగ్‌, కైకలూరు ప్రాంతాల నుంచి వందల కుటుంబాలు కృష్ణా నదిలో చేపల వేట కోసం ఇక్కడికి వలస వచ్చాయి. ఆంధ్రకు చెందిన దళారులు, స్థానిక దళారులతో చేరి ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఆంధ్ర జాలర్లు నదిలో పట్టిన చేపలను.. బడా వ్యాపారులు తమ సిబ్బందిని మరబోటులో జాలర్ల వద్దకు పంపించి కొంటున్నారు. చిక్కిన చేపల్లో పావుకిలో సైజు నుంచి ఆపై ఎంత పెద్ద సైజున్నా వాటిని చేపల వ్యాపారులకు విక్రయిస్తారు. చిన్న చేప పిల్లలను నది తీరంలో ఎండబెట్టి ప్రతి వేసవిలో దేవరకద్ర, మిర్యాలగూడ, విజయవాడ, హైదరాబాద్‌, వైజాగ్‌, రాజమండ్రి తదితర నగరాల్లోని పౌల్ట్రీ ఫాంలకు విక్రయిస్తున్నారు. ఎండుచేప ఒక క్వింటాల్‌ రూ.5 వేలు పలుకుతుంది. ఎండుచేపను తినేవారు వాటిని తులాల్లో కొంటారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఔషధ పరిశ్రమకు కూడా వీటిని అమ్ముతున్నారు. 


క్షీణిస్తున్న మత్స్య సంపద

అలివి వల ద్వారా చిన్న చిన్న చేపపిల్లలను కూడా లాగేస్తుండటంతో మత్స్యసంపద క్షీణిస్తున్నది. పునరుత్పత్తి లేకుండాపోతున్నది. ఈ ఏడాది నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలో రూ.29 లక్షలతో 29 లక్షల చేపపిల్లలను వదిలారు. సమీపంలోని మత్స్యకారులకు టీవీఎస్‌ మోపెడ్లు, ఆటోలు, వలలు, పుట్టీలు, ఐస్‌బాక్సులకోసం రూ.2.5 కోట్లు ఖర్చుచేశారు. కానీ ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి. ప్రభుత్వం చేపలు వదలడమే తరువాయి అన్నట్లుగా వారంకూడా ఆగకుండానే దళారులు అలివివలలతో పట్టుకొని సొమ్ముచేసుకొంటున్నారు.


ఒక్క వల.. టన్ను చేపలు

అలివి వల సామర్థ్యం అంతాఇంతా కాదు. సంప్రదాయ వలల్లో కనీసం అరకేజీ పైన బరువున్న చేపలే పడతాయి. చిన్నచేపలు జారిపోతాయి. అలివి వల అలాంటిది కాదు. దీని పొడవే దాదాపు కిలోమీటర్‌ ఉంటుంది. గట్టి నైలాన్‌ తాడుతో దీన్ని తయారుచేస్తారు. ధర రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. దోమతెరలా చాలా దట్టంగా దీన్ని తయారుచేస్తారు. ఈ వలను విసిరితే.. నీళ్లు తప్ప మరేదీ జారిపోదు. చిన్న చిన్న చేప పిల్ల నుంచి పెద్ద చేపదాకా.. ఇంకా చెప్పాలంటే.. చేపగుడ్డు కూడా జారిపోదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం వదిలిన చేపలు కూడా వలకు చిక్కిపోతున్నాయి. దీంతో చేపల వృద్ధి లేకుండాపోతున్నది. ఈ అలివి వలను వినియోగించడం ఒకరిద్దరివల్ల అయ్యేపనికాదు. ఒకసారి వలను వేసేందుకు.. తర్వాత లాగేందుకు 15 నుంచి 30 మంది వరకు మనుషులు కావాల్సి ఉంటుంది. 


ఇది ఎంతో ప్రమాదంతో కూడినపని. దళారులు కూలీలకు నామమాత్రంగా కూలీ ఇచ్చి నాటుసారా మత్తులో ముంచి పనికానిచ్చుకొంటున్నారు. అలివి వల నదిలో వేసి లాగితే దాదాపు కిలోమీటర్‌ విస్తీర్ణంలో ఉన్న చేపలన్నీ ఒడ్డుకు వచ్చి చేరుతాయి. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో ఈ ఒడ్డు నుంచి అవతలి ఒడ్డువరకు వలవేసి చేపలన్నింటినీ లాగేస్తున్నారు. తెలంగాణ వైపు తనిఖీకి ఎవరైనా అధికారులు వస్తే.. అటు ఒడ్డుకు వెళ్లి తప్పించుకొంటున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారుల బారినుంచి తమను తాము కాపాడుకోవడానికి బ్యాక్‌వాటర్‌ పరిధిలోని చిన్నచిన్న దీవులను కూడా వాడుకొంటున్నారు. ఒకసారి అలివి వలవేస్తే దాదాపు టన్ను చేపలు చిక్కుతాయి. వీటివల్ల రూ.70 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నారు. అలివి వల లాగిన తర్వాత స్థానిక మత్స్యకారులకు ఒక్కచేప కూడా మిగలని పరిస్థితి. 


అలివి వలలు నిషేధం 

ప్రభుత్వం 2018లో అలివి వలలను నిషేధించింది. మాకు సమాచారం వస్తే వెళ్లేవరకు వలలను దాస్తున్నారు. మా శాఖతోపాటు పోలీసు, రెవెన్యూశాఖల మధ్య సమన్వయ లోపం వల్ల తనిఖీలకు ఇబ్బందవుతున్నది. దాడులు నిర్వహించడానికి వెళ్లేలోగానే అక్రమార్కులకు సమాచారం పోతున్నది. దీంతో మేం ఏమీ చేయలేకపోతున్నాం.

- మహిపాల్‌, జిల్లా మత్స్య శాఖాధికారి


నాగర్‌కర్నూలు జిల్లామత్స్యశాఖ ఫిర్యాదు చేయలేదు

మత్స్యశాఖ మాకు సమాచారమివ్వలేదు. వారినుంచి ఫిర్యాదు రాలేదు. మేమే వారికి రెండుసార్లు అలివి వలలతో వేటగురించి సమాచారమిచ్చాం. వారినుంచి దాడులు చేసేందుకు వెళ్లాలని విజ్ఞప్తి రాలేదు. వారు కోరితే సిబ్బందిని పంపిస్తాం. గతంలో అలివి వలలను పట్టుకుని కేసులు పెట్టాం. స్వాధీనం చేసుకున్న అలివి వలలను తిరిగి ఇవ్వలేదు. కోర్టులో అప్పగించాం.

- మురళీగౌడ్‌, ఎస్సై, కొల్లాపూర్‌


మా పొట్ట కొడుతున్నారు 

మా తాత ముత్తాతల నుంచి చేపలు పట్టి బతకడమే తెలుసు. కేసీఆర్‌ సర్కారు మాకు వలలు, నది వద్దకు వెళ్లేందుకు, చేపలు అమ్మేందుకు టీవీఎస్‌ మోపెడ్లు, ఆటోలు, ఐస్‌బాక్సులు, పుట్టీలు, ఇతర పనిముట్లు ఇచ్చింది. ఆంధ్ర, స్థానిక దళారులు కుమ్మక్కై అలివి వలలతో నదిలోని మత్స్యసంపదను అంతా దోచేస్తున్నారు.  మా పొట్ట కొడుతున్నారు. నదిలోకి పోయి చేపలు పడతామంటే ఏమీ మిగలడం లేదు.  

- చిన్న భాస్కర్‌, ఎల్లూరు, కొల్లాపూర్‌ మండలం


logo