శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 02:36:12

ఆల్మట్టిపై మారిన కర్ణాటకం

ఆల్మట్టిపై మారిన కర్ణాటకం

  • మహారాష్ట్ర నుంచి ముంపు ఒత్తిడితో మారినతీరు
  • ఆల్మట్టి, నారాయణపుర నిండకముందే దిగువకు నీళ్లు 
  • కృష్ణాబేసిన్‌లో ఇప్పటివరకు 144 టీఎంసీల వరద

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గతంలో ఆగస్టు నెల మొదలైనా కృష్ణమ్మ తెలుగు రాష్ర్టాల్లోకి ప్రవేశించేది అనుమానంగానే ఉండేది. ఒకవైపు వరద ముంచెత్తుతున్నా.. గేట్లు ఎత్తేందుకు కర్ణాటక వెనకాముందూ ఆలోచించేది. కానీ, ఈ ఏడాది ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతేడాది కంటే పక్షం రోజులు ముందుగానే కృష్ణాజలాలు జూరాలను తాకాయి. ఆల్మట్టి, నారాయణపుర జలాశయాలను పూర్తిగా నింపకుండా, కాల్వలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయకుండా కర్ణాటక అధికారులు ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. ఇప్పటిదాకా కృష్ణా బేసిన్‌కు 144 టీఎంసీల వరద రాగా.. ఇందులో ఆల్మట్టికి వచ్చిందే 99 టీఎంసీలు. కర్ణాటక వైఖరి గతంలోలా ఉంటే ఇంకా ఆల్మట్టి-నారాయణపుర వద్దే బందీ అయ్యేవి. కానీ, ఆదివారం ఉదయం వరకు కర్ణాటక నుంచి 28 టీఎంసీలు దిగువకు విడులయ్యాయి. ఆల్మట్టి ముంపునకు సంబంధించి మహారాష్ట్ర చేస్తున్న ఒత్తిడి ఫలించినందునే కర్ణాటక వైఖరిలో ఈ మార్పు వచ్చినట్టు అధికారులు విశ్లేషిస్తున్నారు.

47 టీఎంసీలు ఖాళీ ఉండగానే.. 

ఆల్మట్టి, నారాయణపుర జలాశయానికి ఈ నీటి సంవత్సరంలో 107 టీఎంసీల వచ్చిన వరద వచ్చింది. ఆల్మట్టి పూర్తినిల్వసామర్థ్యం 129.72 టీఎంసీలు, నారాయణపుర 37.6 4 టీఎంసీలు. ఇందులో 95 శాతానికిపైగా నిండితే తప్ప దిగువకు నీటిని విడుదల చేయకపోయేవారు. పైగా వరద వస్తుండగానే.. కాలువలకు నీటిని వదిలేవారు.  ఎగువ నుంచి ఎంత వరద వచ్చినా దిగువకు నీటిని వదలడం ఆలస్యం చేసేవారు. కానీ, ఆల్మట్టిలో ఆగస్టుకు ముందు పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడంపై మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది. ఆగస్టు మూడోవారం నుంచి పూర్తిస్థాయిలో నింపుకోవాలని, అప్పటివరకు 90-100 టీఎంసీలలోపు నిల్వను మాత్ర మే నిర్వహించుకోవాలని సూచించినట్టు తెలిసింది. 

శ్రీశైలం ఎడమగట్టులో విద్యుదుత్పత్తి

  • 900 మెగావాట్ల పూర్తిస్థాయి ఉత్పత్తి
  • జూరాలకు హెచ్చుతగ్గులుగా వరద 

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి 66,510 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో నీటిమట్టం 842.70 అడుగులకు చేరుకున్నది. అధికారులు ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలోని 6 యూనిట్ల ద్వారా 900 మెగావాట్ల పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. జూరాలకు వరద హెచ్చుతగ్గులుగా వస్తున్నది. ఆదివారం ఇన్‌ఫ్లో 52,000, అవుట్‌ఫ్లో 46,785 క్యూసెక్కులుగా ఉన్నది. ఆల్మట్టికి 47,611, నారాయణపురకు 45,421 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఆదివారం 17,138 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీకి 4,069 క్యూసెక్కుల వరద వస్తున్నది.ఎస్సారార్‌ జలాశయం నుంచి నీటి విడుదలతో ఎల్‌ఎండీలో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ఎల్‌ఎండీ నుంచి కాకతీయ కాలువకు 5 వేల క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 239 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది.  logo