దవాఖాన కర్మచారికే తొలి టీకా

- కరోనా కాలంలో సేవలకు ప్రభుత్వ గుర్తింపు
- మొదటివారం ప్రైవేట్ దవాఖానల్లో టీకాల్లేవు
- హైదరాబాద్ నుంచి జిల్లాలకు చేరిన వ్యాక్సిన్
- మొదట ఒక్కో కేంద్రంలో రోజుకు 30 మందికే టీకాలు
హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారికి భయపడి ప్రపంచం మొత్తం ఇండ్లకే పరిమితమైన సందర్భంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దవాఖానల్లో కొవిడ్ రోగులకు సేవలందించినవారిలో ప్రథములు సఫాయి కార్మికులు. కొవిడ్ వార్డుల్లో అత్యంత ప్రాధాన్య అంశమైన పారిశుద్ధ్యాన్ని వారు కాపాడారు. వైరస్ విస్తరణ వేగాన్ని అదుపుచేయడంలో విశేష సేవలందించారు. దవాఖానల్లో వైద్యులు, పారా మెడికల్ సిబ్బందితోపాటు గొప్ప సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అరుదైన గౌరవం ఇవ్వనున్నది. రాష్ట్రంలో తొలి కరోనా టీకాను వారికే ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాత వైద్య సిబ్బంది, ఇతర కరోనా వారియర్స్‌కు టీకా వేయనున్నారు. ఈ నెల 16న వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానున్నది. గాంధీ దవాఖానలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ టీకా పంపిణీని ప్రారంభించనున్నారు.
మొదటి వారం ప్రైవేటు దవాఖానల్లో టీకాలు లేవు
కరోనా వారియర్లకు టీకాలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈనెల 16న మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 139 కేంద్రాల్లో టీకాలు ఇవ్వనున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.30 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొదటి దశలో వీరికి టీకా వేయనున్నారు. సైడ్ ఎఫెక్ట్ సమస్యలను పర్యవేక్షించేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో టీకాల వితరణలో వైద్యశాఖ స్వల్ప మార్పులు చేసింది. మొదట ఎంపికచేసిన 40 ప్రైవేటు కేంద్రాల స్థానంలో పబ్లిక్ హెల్త్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చారు. మొదట రోజు ఒక్కో కేంద్రంలో 30 మందికి టీకా వేయనున్నారు. ఆ తర్వాత దశల వారీగా రోజుకు 50 మందికి.. 100 మందికి.. ఇలా లబ్ధిదారులతోపాటు కేంద్రాల సంఖ్యను పెంచుకుంటూ పోతారు. మొదటి వారంలో ఏ సమస్యలూ రాకపోతే రెండో వారం నుంచి ప్రైవేట్ కేంద్రాల్లో టీకాలు పంపిణీచేసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇప్పటికే ఆయా జిల్లాల కోల్డ్‌చైన్ పాయింట్లకు వ్యాక్సిన్‌ను పంపించి సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వివరించారు. మొదటిరోజు అత్యధికంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 18,070 మందికి, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో 3,270 మందికి, నిజామాబాద్ జిల్లాలో 3,020 మందికి, వరంగల్‌రూరల్ జిల్లాలో 2,640 మందికి, ఆదిలాబాద్ జిల్లాలో 2,370 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. టీకా వేసిన తర్వాత వయల్‌ను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే తక్షణమే చికిత్స అందించేందుకు 57 దవాఖానల్లో ఐసీయూ పడకలను సిద్ధంగా ఉంచారు.
కోఠి నుంచి వ్యాక్సిన్ సెంటర్లకు
పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి రాష్ర్టానికి మంగళవారం 3.6 లక్షల డోసుల కొవిషీల్డ్ టీకాలు చేరుకున్నాయి. బుధవారం భారత్ బయోటెక్ సంస్థ 20వేల కొవాగ్జిన్ డోసులను వైద్యారోగ్యశాఖకు అప్పగించింది. వీటిని కోఠిలోని ఇమ్యునైజేషన్ బిల్డింగ్‌లో భద్రపరిచారు. అనంతరం జిల్లాలకు పంపిణీ ప్రారంభించారు. వ్యాక్సిన్‌ను ఇన్సులేటెడ్ వాహనాల్లో ఉంచి, ఎస్కార్ట్ వాహనాల మధ్య ఉమ్మడి జిల్లాకేంద్రాలకు తరలించా రు. అక్కడినుంచి జిల్లా కేంద్రాలకు, ఎంపికచేసిన టీకా కేంద్రాలకు చేరుస్తారు.
తాజావార్తలు
- మిస్సింగ్ కేసులను చేధించడమే లక్ష్యం : ఎస్పీ రంగనాథ్
- కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్య: మంత్రి సబిత
- ఖాళీ కడుపుతో 'ఉసిరి' తినవచ్చా?
- నిఖిల్ బర్త్‌డే.. రైడర్ టీజర్ విడుదల
- మంత్రి గులాబ్ దేవికి కరోనా పాజిటివ్
- కోహ్లి వద్దు.. రహానేకే కెప్టెన్సీ ఇవ్వండి!
- జార్ఖండ్‌లో ఘోరం.. మైకా గని పైకప్పు కూలి ఆరుగురు సజీవ సమాధి!
- పది పెళ్లిళ్లు.. సంతానం కలగలేదు.. చివరకు ఇలా..
- డ్రైవర్ల నిర్లక్ష్యంతో బలవుతున్న అమాయకులు: మంత్రి జగదీష్ రెడ్డి
- ఆ దేశంలో మళ్లీ పెరిగిన ఆత్మహత్యలు