గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 01:54:00

కరెంటు మీటరు మాకొద్దు

కరెంటు మీటరు మాకొద్దు

  • నిరంతర ఉచిత విద్యుత్తే ముద్దు
  • కేంద్ర విద్యుత్‌ బిల్లు మోసం
  • రైతులను ఆలోచింపజేసిన  ‘నమస్తే తెలంగాణ’కథనం
  • సీఎం కేసీఆర్‌ ఉండగా ఎవరూ  మీటర్లు పెట్టరని భరోసా

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/దుబ్బాక టౌన్‌: కేంద్ర విద్యుత్‌ బిల్లుకు జనం మద్దతుందని చాటేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తుగడలకు తాము బోల్తాపడబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాయిలకాడ మోటర్లకు మీటరు పెట్టాలని చూస్తే తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చూస్తూ ఉరుకోబోరని వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లుపై సమగ్ర కథనం అందించిన ‘నమస్తే తెలంగాణ’కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ‘కారు మోటరుకా.. కరెంట్‌ మీటరుకా’. మీ ఓటు ఎటు!’ శీర్షికతో గురువారం నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ కథనంపై ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా అన్నదాతలతోపాటు అన్నివర్గాల్లో చర్చ జరిగింది. ప్రజలు ఈ కథనాన్ని ప్రత్యేకంగా చదవడం కనిపించింది. ప్రధానంగా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు ఈ కథనం పట్ల ఆసక్తి చూపించారు. ఈ ప్రభావం ఎన్నికల ప్రచారంలోనూ కనిపించింది. ‘మా బోర్లకు కరెంటు మీటర్లు వద్దు.. 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ముద్దు’ అంటూ పలుచోట్ల నినాదాలు చేయడం కనిపించింది. 

నలుగురు కూర్చున్న చోట ఇదే ముచ్చట

‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాన్ని దుబ్బాక పట్టణంతోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో నలుగురు కూర్చున్న చోటల్లా చదవడం కనిపించింది. ముఖ్యంగా రైతులతోపాటు ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం ఈ కథనాన్ని ఆసక్తిగా అధ్యయనం చేశారు. రైతుల బోరు మోటర్లకు మీటర్లు బిగించేందుకు కేంద్రం తెచ్చిన విద్యుత్‌ చట్టంపై పూర్తి ఆధారాలతో సహా ప్రచురించడం అన్నివర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం వేస్తున్న కరెంట్‌ ఎత్తుగడలపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ వైపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు భరోసానిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు నాశనాన్ని కోరుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మా కేసీఆర్‌ సార్‌ ఊకుంటడా?

రైతుల కోసం మా కేసీఆర్‌ మస్తు చేస్తుం డు. రైతులకు పెట్టుబడి సాయం ఇ స్తుండు. రైతు బీ మా వస్తున్నది. 24 గంటల ఉచిత విద్యుత్‌ వస్తున్నది. ఇంత చేస్తున్న ముఖ్యమంత్రిని రైతులు మరచిపోరు. మోటర్లకు కేంద్రం మీటర్లు పెడితే కేసీఆర్‌ సారు ఊకుంటడా? కేంద్రం దొంగ డ్రామాలు తెలంగాణల సాగయ్‌. నాకు రెండెకరాలున్నది. ఏడాదికి రెండుసార్లు పెట్టుబడి డబ్బులు ఇస్తున్నరు. ఇది రైతులకు ఎంతో ఆధారం, అవసరం. మాటలు మస్తుగ చెప్తరు. కేసీఆర్‌ మాత్రం రైతుల కోసం మంచిపనులు చేసి చూపిస్తుండు. తెలంగాణాలో కేసీఆర్‌ ఉండగా రైతులకు ఢోకా లేదు.

  -కామారం మల్లేశం,  రైతు, నార్సింగి (మెదక్‌)