గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 02:28:55

కేంద్రం కుట్రలను తిప్పికొడదాం

కేంద్రం కుట్రలను తిప్పికొడదాం

  •  విద్యుత్‌ బిల్లును ఉపసంహరించుకోవాలి
  • ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ డిమాండ్‌ 
  • బిల్లును వ్యతిరేకించిన కేసీఆర్‌కు కృతజ్ఞత

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: విద్యుత్‌ సంస్థలను కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌ ఎన్‌ శివాజీ పిలుపునిచ్చారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జాతీయస్థాయిలో పోరాడాలంటూ ఆలిండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ (ఏఐఎఫ్‌ఈఈ) పిలుపుమేరకు సోమవారం విద్యుత్‌ సౌధ ముందు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రం విద్యుత్‌రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తున్నదని శివాజీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణల పేరుతో పెట్టిన బిల్లును వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు శివాజీ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర విద్యుత్‌ బిల్లు వల్ల రాష్ట్ర ప్రజానీకం పెద్దఎత్తున నష్టపోతుందని జేఏసీ కన్వీనర్‌ పీ అంజయ్య చెప్పారు. కేంద్రం విద్యుత్‌ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రామేశ్వర్‌ శెట్టి, నవాజ్‌ షరీఫ్‌, గణేశ్‌, వినోద్‌కుమార్‌, తిరుపతయ్య, పరమేశ్‌, వెంకటేశ్వర్లు, సురేందర్‌, శంకర్‌, వెంకట్‌గౌడ్‌, ఆరోగ్యరాణి, విద్యుత్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. 

యూపీ కార్మికులకు ఎన్సీసీఈఈఈ సంఘీభావం

విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం దుర్మార్గ చర్య అని నేషనల్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ అండ్‌ ఇంజనీర్స్‌ (ఎన్సీసీఈఈఈ) పేర్కొన్నది. ఉత్తరప్రదేశ్‌ విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు చేస్తున్న బతుకు పోరాటానికి ఎన్సీసీఈఈఈ సంఘీభావం ప్రకటించింది. హైదరాబాద్‌లోని మింట్‌కాంపౌండ్‌లో, వరంగల్‌ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్‌, ములుగురోడ్డులోని విద్యుత్‌ కార్యాలయం ఎదుట కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అత్యంత మోసపూరితంగా కేంద్రం తెచ్చిన బిల్లును నిరాకరించి, ఉద్యోగుల పక్షాన నిలిచిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాష్ర్టాల్లో ఈ బిల్లును అడ్డుకోవాలన్నారు. ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ ఉద్యోగులపై అక్కడి ప్రభుత్వం దమనకాండను సాగిస్తున్నదని విమర్శించారు.


logo