గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 02:33:43

ప్రపంచంతోనే పోటీ!

ప్రపంచంతోనే పోటీ!
  • బంగారు తెలంగాణవైపు వడివడిగా అడుగులు
  • సామాజిక ఆర్థిక సర్వే-2020లో వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర సంపదను, తలసరి ఆదాయాన్ని ఏటేటా గణనీయంగా పెంచుకొంటూ ప్రగతిపథంలో పరుగులు తీస్తున్న తెలంగాణ ఇప్పుడు ఏకంగా ప్రపంచంతోనే పోటీపడుతున్నది. ఆర్థిక వృద్ధిరేటులో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగి బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నది. రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే - 2020లో ఈ విషయాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి.  2019 లో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 2.4%, దేశ వృద్ధిరేటు 5%ఉండగా.. తెలంగాణలో 8.2 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నది.  ‘రైతుబంధు’ లాంటి వినూత్న పథకాలతో ఏకంగా ఐక్యరాజ్య సమితి నుంచి ప్రశంసలు అందుకొన్న తెలంగాణ స్థిరమైన వృద్ధితో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నట్టు సర్వే వెల్లడించింది.2014లో రూ.5.05 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ సంపద (జీఎస్డీపీ) ప్రస్తుతం రూ. 9.69 లక్షల కోట్లకు చేరింది.  ప్రజల కొనుగోలుశక్తిని పెంచడం, విద్యుత్‌, సాగునీరు, పారిశ్రామిక రంగాల్లో మౌలికవసతులను మెరుగుపర్చడంతో వృద్ధి సాధ్యమైంది.


విద్యుత్‌తో మొదలు

విద్యుత్‌ రంగాన్ని సమూలంగా సంస్కరించి అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ను అందించడంతో పారిశ్రామికరంగం పుంజుకున్నది. టీఎస్‌ఐపాస్‌తో 11,857 పరిశ్రమలు రావడంతో 13.08 లక్షల మందికి ఉపాధి లభించింది. రూ.80,500 కోట్లతో రూపుదిద్దుకొన్న కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర సామాజిక, ఆర్థిక ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. తెలంగాణ ఇప్పుడు కోటి ఎకరాలకు సాగునీటిని అందించే దిశగా సాగుతున్నది. 


ఆరేండ్లుగా అదే నిలకడ

ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ రాష్ట్రం లో వృద్ధిరేటు నిలకడగా కొనసాగుతున్నది. గత ఆరేండ్లలో తెలంగాణ జీఎస్డీపీ సగటు వృద్ధిరేటు 9.25 శాతంగా నమోదవగా.. దేశ జీడీపీ సగటు 6.97 శాతానికే పరిమితమైంది. తెలంగాణ తలసరి ఆదాయం కూడా ఏటేటా  పెరుగుతున్నది. ప్రస్తుత ధరల వద్ద ఈ ఆర్థిక సంవత్సరం (2019-20)లో రాష్ట్ర తలసరి ఆదాయం 11.6 శాతం వృద్ధిచెంది రూ.2.28,216కు పెరుగగా.. దేశ తలసరి ఆదాయం మాత్రం కేవలం 6.3 శాతం వృద్ధితో రూ.1,34,432కు పరిమితమైంది.


సామాజిక సంక్షేమంతో సత్ఫలితాలు

ప్రజా సంక్షేమంతోపాటు విద్య, ఆరోగ్యరంగాలకు రాష్ట్ర ప్రభుత్వం  ప్రాధాన్యమివ్వడం సత్ఫలితాలను ఇస్తున్నది. ఆహార భద్రత, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కంటి వెలుగు, కేసీఆర్‌ కిట్లు, ఆరోగ్య లక్ష్మి, పౌష్టికాహారం లాంటి పథకాలు రాష్ట్రంలో మానవవనరులను పెంపొందిస్తున్నాయి. 2013లో 92గా ఉన్న మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్‌) 2017లో 76కు తగ్గింది. కేసీఆర్‌ కిట్ల వల్ల ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల శాతం 31 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది.  పట్టణ, గ్రామీణ ప్రగతికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం స్థానిక సంస్థలకు నెలనెలా భారీగా నిధులు కేటాయిస్తున్నది. కొత్త పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను తీసుకొచ్చి ప్రజల చేతుల్లో పాలన ఉంచింది. షీటీమ్స్‌, సీసీ కెమెరాల ఏర్పాటుతో మహిళలు, పిల్లలకు పటిష్ఠ భద్రత కల్పించడంతోపాటు హైదరాబాద్‌ను అత్యంత సురక్షిత నగరంగా తీర్చిదిద్దింది. దీంతో ఇప్పుడు పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు హైదరాబాద్‌ వేదికగా నిలుస్తున్నది. అన్ని రంగాల్లో పురోగతిని మదించి తెలంగాణకు నీతి ఆయోగ్‌ మూడో ర్యాంకును ఇవ్వడం వృద్ధిలో మన రాష్ట్రం దూసుకుపోతున్నదని స్పష్టం చేస్తున్నది.\


సంపూర్ణ ప్రతిఫలనం.. ‘నివేదిక’ ముఖచిత్రం

అద్భుతంగా తీర్చిదిద్దిన ఏలె లక్ష్మణ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రం ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ‘సామాజిక ఆర్థిక సర్వే నివేదిక’కు కవర్‌పేజీ.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్‌ రూపొందించిన ముఖచిత్రం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, ప్రజలకు అందుతున్న సంపూర్ణ ఫలాలను ప్రతిబింబి స్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీటిని ఎత్తిపోస్తున్న పంపులు, జలకళ సంతరించు కున్న కాల్వలు, ఉత్సాహంగా నాట్లేస్తున్న మహిళలు, పవర్‌ ప్రాజెక్టులు, ఇంటింటికీ సురక్షిత నీరు అందిస్తున్న మిషన్‌ భగీరథ, నిరుపేదలకు నీడనిచ్చే డబుల్‌ బెడ్‌ రూంలు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, కంటివెలుగు, బాలింతల సంరక్షణ, గొర్రెల పంపిణీ, హరితహారం.. ఈ పథకాలన్నింటి రూపకర్త సీఎం కేసీఆర్‌ చిత్రాలతో కూడిన కవర్‌పేజీని ఎంతో అద్భుతంగా రూపొందించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాభివృద్ధిని కవర్‌పేజీ కండ్లకు కడుతున్నది.
logo