శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 01:48:15

దశాబ్దాల కల సాకారం

దశాబ్దాల కల సాకారం

బోర్నపల్లి వంతెనను ప్రారంభించిన మంత్రి కొప్పుల

రాయికల్‌/ రాయికల్‌ రూరల్‌, జనవరి 5: కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం బోర్నపల్లి వద్ద గోదావరిపై నిర్మించిన వంతెన అందుబాటులోకి వచ్చింది. మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించడంతోపాటు వంతెన మీదుగా నిర్మల్‌ జిల్లా కడెందాకా వెళ్లే బస్సును ప్రారంభించారు. అదే బస్సులో నిర్మల్‌ జిల్లా చిన్న బెల్లాల వరకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రయాణించారు. 2014లో సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుంట్ల కవిత రాయికల్‌ మండలంలో పర్యటించగా వంతెన నిర్మించాలని స్థానికులు కోరారు. దీంతో ఆమె ప్రత్యేక చొరవతో వంతెనతోపాటు బోర్నపల్లి నుంచి రాయికల్‌ దాకా 18 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారి నిర్మాణానికి రూ.70 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయించా రు. 2016 ఏప్రిల్‌ 6న పనులకు అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్‌, ఎంపీ కవిత శంకుస్థాపన చేశారు. 1200 మీటర్లు పొడవు, నాలుగు లైన్ల వెడల్పుతో నిర్మించారు.  కొద్దిరోజుల క్రితమే వంతెన నిర్మాణం పూర్తయింది. మంగళవారం మంత్రి వంతెన ప్రారంభించడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమైంది.