శనివారం 06 జూన్ 2020
Telangana - May 10, 2020 , 06:20:32

విషమించిన వారికే ‘డిశ్చార్జి’ పరీక్ష

విషమించిన వారికే ‘డిశ్చార్జి’ పరీక్ష

హైదరాబాద్‌: దవాఖానలో చేరిన కరోనా రోగుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవాళ్లకు మాత్రమే డిశ్చార్జికి ముందు మళ్లీ పరీక్ష నిర్వహించాలని కేంద్రం సూచించింది. ఇలాంటి వాళ్లు పూర్తిగా కోలుకునే వరకు ఇంటికి పంపవద్దని కోరింది. ఒకవేళ లక్షణాలు తగ్గినా, ఆర్‌టీ-పీసీఆర్‌ నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చే వరకు డిశ్చార్జి చేయకూడదని పేర్కొంది. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న కరోనా రోగులకు డిశ్చార్జికి ముందు మళ్లీ పరీక్ష అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఒక మోస్తరు కరోనా లక్షణాలతో దవాఖానలో చేరిన వారికి వరుసగా మూడు రోజులపాటు జ్వరం రాకుంటే, లక్షణాలు తగ్గిన 10 రోజుల్లో వారిని డిశ్చార్జి చేయవచ్చు. వారికి మళ్లీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదు.

తీవ్రత తక్కువతో దవాఖానలో చేరిన వారు పది రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. ఈ సమయంలో ఎలాంటి మందులు తీసుకోకుండా, మూడ్రోజులపాటు జ్వరం రాకుండా.. నాలుగు రోజులు వరుసగా ఆక్సిజన్‌ సాచురేషన్‌ 95% కంటే ఎక్కువ ఉంటే ఎలాంటి శ్వాస సమస్యలు తలెత్తకపోతే వారిని 10 రోజుల్లో డిశ్చార్జ్‌ చేయొచ్చు. మళ్లీ పరీక్షలు అవసరంలేదు. 

ఒకవేళ జ్వరం తగ్గకపోయినా, ఆక్సిజన్‌ సాచురేషన్‌ పడిపోయినా.. పూర్తి లక్షణాలు తగ్గే వరకు దవాఖానలో వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. 

డిశ్చార్జి అయిన వాళ్లు ఇంట్లో ప్రత్యేక గదిలో ఏడు రోజులపాటు ఏకాంతంగా ఉండాల్సిందే. 


logo