శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 01:22:46

తేడా ఓటు ఐటీకి వేటు

తేడా ఓటు ఐటీకి వేటు

 • ఒక్క పొరపాటుతో  అభివృద్ధి బూడిదలోకి
 • కంపెనీలన్నీ పక్షుల్లా ఎగిరిపోవడం ఖాయం
 • 23 లక్షల మంది ఉపాధికి పెను ముప్పు
 • రాజకీయం మాటున దాగిన విద్వేషం.. 
 • ఐటీ రంగ పరిశ్రమపై మతోన్మాద కత్తి

కొన్నేండ్లుగా గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, యాపిల్‌, ఫేస్‌బుక్‌.. వంటి ఎన్నో కంపెనీలు తమ క్యాంపస్‌ల ఏర్పాటుకు హైదరాబాద్‌నే ఎంచుకొన్నాయి.  ఈ సంస్థలన్నీ హైదరాబాద్‌కే ఎందుకు వస్తున్నాయి? ఇక్కడే వేలకోట్ల పెట్టుబడులను ఎందుకు పెడుతున్నాయి? ఆయా కంపెనీలను ఒప్పించగలిగే సమర్థమైన నాయకత్వం, కంపెనీలకు అనువైన సౌకర్యాలు కల్పించే ప్రభుత్వం ఉండటం. ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరంగా హైదరాబాద్‌ ఎదగటం. 

ఏ కంపెనీ అయినా ఒకచోట తమ క్యాంపస్‌ను ఏర్పాటుచేసుకోవాలంటే..  కొన్నేండ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం సాగుతుందన్న నమ్మకం ఉంటేనే వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న డాటాను సర్వర్లలో భద్రపరచాలంటే దేశంలోనే హైదరాబాద్‌ను మించిన సేఫ్‌ సిటీ ఎంఎన్‌సీలకు కనిపించడంలేదు. ఇప్పుడీ ప్రశాంతత భగ్నమైతే.. సామరస్య వాతావరణం విచ్ఛిన్నమైతే.. లక్షల కోట్ల పెట్టుబడులతో వచ్చిన కంపెనీలు ఒక్కసారిగా పక్షుల్లా ఎగిరిపోతాయి. దాదాపు ఒకటిన్నర కోట్ల లక్షల రూపాయల ఐటీ ఎగుమతులు.. ఒక్క రక్తపుచుక్క నేలరాలినా సున్నా చుడతాయి.   ఈ పరిణామం మనకు వాంఛనీయమా? 

మనం వేసే ఒక్క తప్పటడుగు.. మన భవిష్యత్తును తారుమారుచేస్తుంది. మనం వేసే ఒక సరైన అడుగు మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌పై ఒక్కసారి చిన్న మచ్చ పడినా.. దాన్ని తొలిగించుకోవడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. అప్పటికి ప్రపంచం ఎంతదూరం పోతుంది.. మనం ఎక్కడ ఉంటాం? 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మతోన్మాదంతో రెచ్చిపోతున్న నేతలను చూస్తుంటే.. మునుపెన్నడూ లేని భయాందోళనలు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నాయి. ఆలోచించండి. మనం తీసుకొనే నిర్ణయం హైదరాబాద్‌ను సురక్షితంచేయాలి. మన ఓటు వినాశనం వైపు కాకుండా అభివృద్ధి వైపు నడిపించాలి.  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆరున్నరేండ్లుగా ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టుకొన్నాం. నెమ్మది నెమ్మదిగా పెంచుకొన్నాం.. సైబర్‌ టవర్‌ నుంచి టీహబ్‌ దాకా, టీహబ్‌ నుంచి వీహబ్‌ దాకా.. వీ హబ్‌ నుంచి టీ టవర్స్‌ దాకా.. విశ్వవ్యాప్తంగా ఐటీ రంగంలో మేటి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుకొన్నాం. ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపాం. 13 వేల కంపెనీలు.. 23 లక్షల మంది ఉపాధితో ముడిపడి ఉన్న రంగమిది. దేశంలోనే ఆరో మహానగరంగా, కాస్మొపాలిటన్‌ సిటీగా హైదరాబాద్‌ ఎదిగిందంటే.. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి సుదీర్ఘ లక్ష్యంతో  మన పాలకులు చేసిన కృషి ఫలితమిది. ఇన్ని వేల కంపెనీలు హైదరాబాద్‌లో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయంటే.. మహానగరంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం రాకపోవడం. అలాంటి శాంతిభద్రతలకే ముప్పువాటిల్లితే? కంపెనీలు మనుగడ సాగిస్తాయా?  పరిస్థితి ఊహించడానికే భయంగా ఉన్నది. ఆరున్నరేండ్లుగా  ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో కలకలం రేపితే ఇన్నేండ్లుగా మనం కడుపులో పెట్టుకొని పెంచుకొన్న ఐటీరంగం కకావికలమైపోదా? దాదాపు లక్షన్నర కోట్ల ఐటీ ఎగుమతులు ఆగిపోతే తెలంగాణ ఆగమైపోదా? ఆలోచిస్తేనే ఒళ్లు వణుకుతో గగుర్పొడుస్తున్నది.  ఇన్నేండ్లుగా అందరినీ ఆదరిస్తూ.. కలుపుకొనిపోతూ.. పెట్టుబడులను సాధిస్తూ.. ఉపాధి కల్పిస్తూ కొనసాగుతున్న పాలన ఎక్కడైనా ఉన్నదా? ఎవరిపైనైనా వ్యతిరేకత కనిపించిందా? ఎక్కడైనా విద్వేషం పొడచూపిందా? చీలికలు, పీలికలు చేయడం ఉన్నదా?కొందరు చిల్లర నేతల కిర్రిమొర్రి వేషాలతో.. ఉద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా నో.. మతోన్మాదంతో పేట్రేగిపోతే.. ఎంతో సురక్షితంగా భావించి ఇక్కడ పెట్టుబడి పెట్టిన కంపెనీలు మరోచోటికి తరలిపోతే..  మన జీవితాలు ఏమవుతాయి? ఏం చేయాలో మనమే ఆలోచించుకోవాలి.

ఊగిపోతున్న ఉన్మాదులు

హైదరాబాద్‌లో  కల్లోలం రేపి, హైదరాబాద్‌ కలల సౌధాన్ని పేకమేడలా కూల్చడానికి కొన్ని మతపార్టీలు ఉన్మాదంతో ఊగిపోతున్నాయి. తాము ఒక ప్రజాస్వామిక దేశంలో.. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్నామని.. సమాజం పట్ల తమకు ఎంతో బాధ్యత ఉంటుందన్న ఇంగితం కూడా వారికి లేకుండాపోయింది.  కొన్నిరోజులుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పేలుతున్న మాటల పర్యవసానం ఎలా ఉంటుందోనని  ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. రాజకీయంకోసం ఆడుతున్న డ్రామాల వల్ల రేపు హైదరాబాద్‌లో అనిశ్చితి నెలకొంటే ఎవరు బాధ్యులు? పెట్టుబడులు పెట్టేందుకు నేడు క్యూ కడుతున్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తే ఎవరు కారణం? 

ఏండ్ల కల.. నిరంతర కష్టం..

తెలంగాణ ఏర్పడితే అభివృద్ధి జరుగదని, ఇతర రాష్ట్రాలకు కంపెనీలు తరలిపోయి, ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయని ఆనాడు భయపెట్టారు. దీన్ని సవాలుగా తీసుకొన్న తెలంగాణ ప్రభుత్వం ఐటీని ప్రాధాన్యశాఖగా భావించింది. ఐటీ అంటే బెంగళూరు మాత్రమే కాదని, హైదరాబాద్‌ అని చాటింది. దీంతో పలు ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వరుసకట్టాయి. ఫలితంగా 2013-14లో రూ.57 వేల కోట్ల ఐటీ ఎగుమతులు మాత్రమే ఉంటే... ఇప్పుడు రూ.1.28 లక్షల కోట్లకు పెరిగాయి. వివిధ కంపెనీల్లో ప్రత్యక్షంగా 5.82లక్షల మందికి ఉద్యోగాలొస్తే.. పరోక్షంగా 18 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఐటీ ఎగుమతుల్లోనూ  జాతీయ సగటు 8.09%తో పోలిస్తే తెలంగాణ ఐటీ, దాని సంబంధిత ఎగుమతులు 17.97%కి చేరుకొన్నాయి. ఒకవైపు ఎగుమతుల్లో, మరోవైపు ఉపాధి కల్పనలో తెలంగాణ.. ఐటీరంగంలో రారాజుగా వెలుగొందుతున్నది. 

ప్రశాంత వాతావరణమే పెట్టుబడులకు ఊతం

ఎక్కడ శాంతిభద్రతల నిర్వహణ పక్కాగా ఉం టుందో.. అక్కడికే పెట్టుబడులు తరలివస్తాయి. ఈ దిశగా ప్రత్యేక శ్రద్ధ చూపించిన తెలంగాణ ప్రభుత్వం పూర్తి విజయవంతమైంది. ఇతర దేశాలు, రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నప్పటికీ, వివిధ మతాలు, కులాల వారు ఉపాధి, ఉద్యోగాలు చేసుకుంటున్నప్పటికీ నగరంలో ఏనాడూ శాంతిభద్రతల సమస్య రాలే దు. బాంబులు పేలలేదు, అల్లర్లు జరుగలేదు. కర్ఫ్యూ విధించే పరిస్థితి రాలేదు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వం హైదరాబాద్‌లో ఐదు లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటుచేసింది. రాత్రివేళ సైతం అమ్మాయిలు ధైర్యంగా తిరిగేలా 24 గంటల పెట్రోలింగ్‌, షీ టీంలను ఏర్పాటుచేసి భరోసా నింపింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు అండగా షీ షటిల్‌, హాక్‌ ఐ,  మహిళా పోలీస్‌స్టేషన్‌, సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఏర్పాటు వంటి చర్యలను తీసుకున్నది.  

పచ్చని నగరానికి నిప్పు పెట్టే యత్నాలు

అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలు.. ఇలా ఏ అంశం తీసుకున్నా హైదరాబాద్‌ దేశంలోనే తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకొన్నది. అంతర్జాతీయ కంపెనీలు, 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌,  మెట్రోను మణిహారంగా కలిగిన హైదరాబాద్‌.. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటున్నది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ రాజకీయ నాయకులు చేస్తున్న నీచ రాజకీయాలు ప్రతి ఒక్కరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌లో అశాంతి నెలకొంటే, ఇక్కడి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తాయి. ఉద్యోగాలుపోతాయి. ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ తగ్గుతుంది. రియల్‌ ఎస్టేట్‌ ప్రభావితమవుతుంది. యావత్‌ తెలంగాణపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ప్రజలు ఆలోచనచేసి విద్వేషం వైపు కాకుండా, అభివృద్ధి వైపు ఓటేయాలని మేధావులు సూచిస్తున్నారు. 

ప్రముఖ కంపెనీల క్యూ

ఆరేండ్లలో టీఎస్‌ఐపాస్‌ ద్వారా 13 వేల కంపెనీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. ఐటీలో ప్రపంచస్థాయి కంపెనీలు కార్యాలయాలు ఏర్పాటుచేశాయి. అమెజాన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తుండగా, మైక్రాన్‌ అతిపెద్ద రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్నది. రాష్ట్రంలో 20,761 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఇటీవల అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ప్రకటించింది. ప్రభుత్వ విధానాలకు తోడు మంత్రి కేటీఆర్‌ చొరవ పెట్టుబడులకు ఆయస్కాంతంగా మార్చాయని అనేక కంపెనీల అధిపతులు పలుమార్లు బహిరంగంగానే ప్రశంసించారు. 

అభివృద్ధి వైపు పరుగు

మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సిటీగా హైదరాబాద్‌ ఎదిగేందుకు భౌగోళిక పరిస్థితులు అనుకూలించాయి. మిగతా మౌలిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. పెట్టుబడులకు ముఖ్యమైన సుపరిపాలన, నాణ్యమైన మౌలిక సదుపాయాలు, అనుకూల విధానాలు, కాస్మొపాలిటన్‌ కల్చర్‌, నైపుణ్యం గల ఉద్యోగులకు తోడు.. పారదర్శకత పెంపొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. టీఎస్‌ఐపాస్‌తోపాటు ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఐటీ పాలసీ అనేక కంపెనీలు హైదరాబాద్‌వైపు చూసేందుకు దోహదపడింది.  నగరం నలువైపులా ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు గ్రిడ్‌ పాలసీని తీసుకొచ్చింది. కంపెనీలకు సదుపాయాల్లో రాయితీ ప్రకటించింది. కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో కంపెనీలు పెట్టబడులు పెడుతున్నాయి. 

టీసీఎస్‌ @ 50వేల ఉద్యోగులు

ఐటీ రంగానికి తెలంగాణ అందిస్తున్న సహకారంతోఅనేక సంస్థలు.. రాష్ట్ర ప్రభుత్వ చొరవకు తమ కృషిని జోడించి.. హైదరాబాద్‌కు, మొత్తంగా తెలంగాణకు ఐటీ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెస్తున్నా యి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న టీసీఎస్‌.. హైదరాబాద్‌ బ్రాంచ్‌లో నియామకాలను 50 వేల మార్కును దాటించింది. 2014లో టీసీఎస్‌ సంస్థ అప్పటి సీఈవో చంద్రశేఖరన్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజన్నలు తనతో సమావేశమైన సందర్భంగా.. టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్యను 50వేలకు పెంచాలని, ప్రభుత్వపరంగా సహాయాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అందుకు సై అన్న సంస్థ ప్రతినిధులు ఆమేరకు సీఎంకు హామీ ఇచ్చారు. ఆరేండ్ల వ్యవధిలోనే.. ఇచ్చిన మాట ప్రకారం 2020 అక్టోబరు చివరి నాటికి టీసీఎస్‌ లక్ష్యాన్ని చేరింది. ఇప్పుడు టీసీఎస్‌ హైదరాబాద్‌ బ్రాంచ్‌లో 50వేల ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, టీసీఎస్‌ హైదరాబాద్‌లో ఏర్పాటైన తొలి భారీ ఐటీ సంస్థ. 1996లో తొలి శాఖను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన టీసీఎస్‌లో 2007 నాటికి సిబ్బంది సంఖ్య 4500 మాత్రమే. 2014 నాటికి ఆ సంఖ్య 26వేలకు పెరిగింది. ప్రస్తుతం టీసీఎస్‌లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 50వేలు. 

చైనా టీసీఎస్‌ బ్రాంచ్‌ హెడ్‌గా ఉన్నప్పుడు ఆ దేశాన్ని పెట్టుబడుల ఫ్రెండ్లీ దేశమనుకొనే వాళ్లం. కానీ హైదరాబాద్‌కు వచ్చాక సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ స్పందన చూశాక చైనానే కాదు తెలంగాణ కూడా పెట్టుబడులకు అనువైన ప్రాంతమనే అభిప్రాయం కలిగింది. అంత బాగా స్పందించారు. - రాజన్న, టీసీఎస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ 

ఐటీలో ముఖ్యమైనవి..

 • టీ-హబ్‌ ద్వారా స్టార్టప్స్‌కు ప్రోత్సాహం
 • మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్‌
 • టీ-వర్క్స్‌ ద్వారా నూతన ఆవిష్కరణలు 
 • ప్రజలకు సులభతర సేవల కోసం టీఎస్‌టీఎస్‌
 • యువతలో నైపుణ్యాలు పెంచేందుకు టాస్క్‌
 • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఏడాదిగా 2020 సంవత్సరం.
 • వివిధరంగాల్లో పరిశోధన, అభివృద్ధి కోసం రీచ్‌
 • ఐటీ శాఖ ప్రోత్సహిస్తున్న అధునాతన సాంకేతికతలు.. బ్లాక్‌ చెయిన్‌, క్లౌడ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, వర్చువల్‌ రియాల్టీ అండ్‌ అగుమెంటెడ్‌ రియాల్టీ, రోబోటిక్స్‌, త్రీడీ ప్రింటింగ్‌, బిగ్‌ డాటా
 • ప్రశాంత నగరంగా హైదరాబాద్‌

నగరం ప్రశాంతంగా ఉన్నది. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరుగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకొంటున్నాం. ఐటీ సెక్టార్‌ పరిధిలో నిరంతరం పెట్రోలింగ్‌ చేస్తున్నాం. ఐటీ ప్రాంతాల్లో భద్రతకోసం లక్షా 20 వేల సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాం. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి కోసం క్విక్‌ రియాక్షన్‌ టీంలను ఏర్పాటుచేశాం. మహిళా ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేకంగా కమిషనరేట్‌ పరిధిలో ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌ ఖ్యాతిని ఇనుమడింప చేయడంలో శాంతి భద్రతల పాత్ర కీలకంగా మారింది.  

- సజ్జనార్‌, సీపీ సైబరాబాద్‌

పెట్టుబడుల స్వర్గధామం

రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌ ఐటీ రంగం వృద్ధిలో దూసుకుపోతున్నది. లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. కంపెనీలు పెట్టుబడులు పెట్టే విషయంలో శాంతి భద్రతలు, ప్రభుత్వ విధానాలు, పారదర్శకత, నైపుణ్యం గల యువతను చూసుకుంటాయి. ఇవన్నీ ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వంగా నిలువడంలో హైదరాబాద్‌ ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రశాంత నగరం ఇలాగే కొనసాగాలని అందరూ కోరుకొంటున్నారు. 

-సందీప్‌కుమార్‌ మక్తాల, టిటా గ్లోబల్‌ ప్రెసిడెంట్‌

ఆరేండ్లుగా ప్రశాంతంగా ఉన్నాం

హైదరాబాద్‌ ఆరేండ్లుగా ప్రశాంతంగా ఉన్నది. ప్రజలు గుండెలమీద చేతులు వేసుకొని నిద్రపోతున్నారు. మన నగరానికి జాతీయ స్థాయిలో ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్నది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉన్నది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొన్నిపార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయి. వాళ్లు అధికారంలోకి వస్తే అశాంతి పెరిగి.. వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి. వ్యాపారం ప్రశాంతంగా సాగితేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అప్పుడే ఇక్కడికి వచ్చిన ప్రజలకు భరోసా ఉంటుంది. విద్వేషాలు చెలరేగితే వారంతా నష్టపోతారు. 

- అమరవాది సుమన్‌, ఎండీ, స్నికా ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 

టీఆర్‌ఎస్‌తోనే బ్రాండ్‌ హైదరాబాద్‌ 

హైదరాబాద్‌లో వీళ్లే ఉండాలి.. వాళ్లే ఉండాలి అంటూ విభజిస్తే మన బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతింటుంది. శాంతిభద్రతలు లోపిస్తే పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం దెబ్బతింటుంది. భూముల ధరలు పడిపోతాయి. రియల్‌ రంగంతో ముడిపడి ఉన్న కూలీలు మొదలు పారిశ్రామికవేత్తలవరకు ఉపాధి కోల్పోతారు. హైదరాబాద్‌ ఇమేజ్‌ను కొనసాగించడం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని నా నమ్మకం. 

  - అనిల్‌ సుస్కండ్ల, జేబీ ఇన్‌ఫ్రా గ్రూప్‌ డైరెక్టర్‌logo