ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 10, 2020 , 05:09:58

నక్షను దాటిన నంబర్లు

నక్షను దాటిన నంబర్లు
  • గ్రామ రెవెన్యూలో లేని సర్వేనంబర్లు కేటాయింపు
  • వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ రెవెన్యూలో సరికొత్త లీల
  • వందమందికిపైగా రైతులకు అందని రైతుబంధు, రైతుబీమా
  • 65ఏండ్ల క్రితంనాటి తప్పు.. నేడు దేవునూరు రైతులకు శిక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రెవెన్యూ అధికారుల లీలల్లో ఇదో కొత్తరకం లీల.. రికార్డుల గురించి కొద్దోగొప్పో అవగాహన ఉన్నవారికి కూడా గ్రామ నక్ష ప్రకారమే సర్వే నంబర్లు కేటాయిస్తారని తెలుసు. గ్రామ రెవెన్యూలో ఉన్న భూమి మొత్తం ఆ సర్వే నంబర్లలోనే ఉంటుంది. భూమిని ఒకరి నుంచి మరొకరు కొనుగోలు చేసినా.. ప్రభు త్వ భూమిని లబ్ధిదారులకు కేటాయించినా అంతకుముందు సర్వేనంబర్‌ను లేదా దానికి బై నంబర్‌ను కేటాయిస్తారు. కానీ.. ఓ రెవె న్యూ అధికారి నక్షలో లేని నంబర్లను కేటాయించారు. 65 ఏండ్ల క్రితం రెవెన్యూ అధికారులు చేసిన తప్పు తాజాగా భూ రికార్డుల ప్రక్షాళనలో బయటపడింది. అప్పటిదాకా పాత పాస్‌పస్తకాలు, బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులు ఇప్పుడు రైతుబంధు, రైతుబీమా పథకాల కింద లబ్ధిపొందకపోగా.. తమ భూములకు రిజిస్ట్రేషన్లు కూడా లేవని తెలిసి మథనపడుతున్నారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదానికి తాము శిక్ష అనుభవిస్తున్నామంటూ దేవునూరు రైతులు ‘నమస్తే తెలంగాణ’ ధర్మగంటను ఆశ్రయించారు. 


వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం దేవునూరు గ్రామనక్షలో 1 నుంచి 607 వరకు సర్వేనంబర్లు ఉన్నాయి. సీసీఎల్‌ వెబ్‌సైట్‌లో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. 536 సర్వేనంబర్‌లో 598 ఎకరాల 11 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది. అందులోని 130 ఎకరాలతోపాటు, మరికొన్ని సర్వేనంబర్ల నుంచి 1954-55లో గ్రామస్థులు కొందరికి భూములు ఇచ్చి పట్టాలుచేశారు. ఆ భూములకు నాటి రెవెన్యూ అధికారులు 536కు బై నంబర్లు ఇచ్చి పట్టాలు చేయకుండా.. రెవెన్యూలో చివరి నంబర్‌ 607 తర్వాత 608 నుంచి నంబర్లు కేటాయించారు. సర్వేనంబర్లు 608 నుంచి 637 వరకు ఇస్తూ ప్రభుత్వ భూమిని పట్టాచేశారు. రైతుల పేర్లు పహాణీలో రావడంతోపాటు, ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా ఇచ్చింది. వాటిని బ్యాంకుల్లో పెట్టి కొంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు. 


అందని ప్రభుత్వ పథకాలు..

ప్రస్తుతం ఈ భూమిపై మూడుతరాలు మారాయి. తాతలకు ఇచ్చిన భూములను ఇప్పుడు మనుమండ్లు, మనుమరాండ్రు, మునిమనుమండ్లు సాగు చేసుకుంటున్నారు. 65 ఏండ్ల క్రితం జరిగిన ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో బయటపడింది. దేవునూరు భూ రికార్డులకు బయటకుతీసిన రెవెన్యూ అధికారులు 608 నుంచి 637 సర్వేనంబర్ల వరకు గ్రామనక్షలో లేవని వాటిలోని భూములను ‘బీ’ క్యాటగిరీలో పెట్టారు. తమకు కొత్తపాస్‌పుస్తకాలు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ఆరా తీయగా ఈ విషయం బయటపడింది. ఏండ్లుగా భూమిని సాగుచేసుకుంటున్నా  మని.. తమకు రైతుబంధు, రైతుబీమా పథకాలు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ముత్తాత భూమికి సర్వేనంబర్‌ లేదంటున్నారు

మా ముత్తాత గ్యారంపల్లి రామయ్యకు 1954-55లో నాటి ప్రభుత్వం 3.14 ఎకరాలు పట్టా చేసింది. 619 సర్వేనంబర్‌ కేటాయించి కాస్తుకార్లకు ఎక్కించారు. రామయ్య నుంచి మనుమరాలు.. మా అమ్మ గ్యారంపల్లి రాధాబాయికి వారసత్వంగా వచ్చింది. ఆమె పేరుమీద పట్టా చేయడంతోపాటు ఖాతానంబర్‌ 81 కూడా ఇచ్చారు. మా అమ్మ వృద్ధాప్యంలో తనపేరుమీద భూమిని నా పేరుమీదకు విరాసత్‌ కింద పట్టాచేయడానికి దరఖాస్తు చేస్తుకుంటే 619 సర్వేనంబర్‌ లేదని తిరస్కరించారు. దీంతో కనపడిన అధికారికల్లా దరఖాస్తు చేసుకుంటున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. పాత డాక్యుమెంట్లు చూపించినా కూడా పార్ట్‌(బీ)లో పెట్టాం. మీ భూమిని మీరే సాగు చేసుకుంటున్నారు కదా.. అని చెప్తున్నారు తప్ప పట్టా ఇవ్వడం లేదు. నేనొక్కడినే కాదు.. మా ఊర్లో దాదాపు వందమంది రైతులు ఇలా ఇబ్బంది పడుతున్నారు. 608 నుంచి 637 వరకు ఉన్న సర్వేనంబర్లు గ్రామనక్షలో లేవని చెపుతున్నారు.

- ఎం రాజేందర్‌, గ్యారంపల్లి రాధాబాయి కుమారుడు


ఆర్డీవో, జేసీలకు సరిచేసే అధికారం ఉంది

సెటిల్‌మెంట్‌ రికార్డు (సేత్వార్‌)లో ప్రతినంబర్‌ ఉంటుంది. ఏ భూమికైనా కొత్త సర్వేనంబర్లు ఇస్తే సప్లిమెంటరీ సేత్వార్‌ ఇస్తారు. అలా సప్లిమెంటరీ సేత్వార్‌ ఇస్తే కొత్తసర్వేనంబర్లకు విలువ ఉంటుంది. అలా సప్లిమెంటరీ సేత్వార్‌ విడుదల చేయకుండా తాసిల్దార్‌ తానే సర్కారు అనుకొని ఇష్టం వచ్చినట్టుగా సర్వేనంబర్లు ఇస్తే వాటికి విలువ ఉండదు. అయితే ఈ సర్వేనంబర్‌ నుంచి రైతులకు ఎంత భూమిని కేటాయించారో చూసుకొని ఆర్వోఆర్‌ చట్టంలో సెక్షన్‌ 5బీ/2 కింద ఆర్డీవో, సెక్షన్‌ 9 కింద జేసీ రికార్డులు సరిచేయవచ్చు. ఈ రైతుల భూములకు గ్రామనక్షలోఉన్న సర్వేనంబర్లకే బైనంబర్లు ఇవ్వొచ్చు.

- ఎం సునీల్‌కుమార్‌, భూమిచట్టాల న్యాయనిపుణుడు, 

నల్సార్‌ లా యూనివర్సిటీ అడ్జెంట్‌ ప్రొఫెసర్‌


logo