మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 17:03:37

ప్రజల ఆస్తుల‌కు హ‌క్కు, భ‌ద్రత క‌ల్పించేందుకే వివరాల న‌మోదు

ప్రజల ఆస్తుల‌కు హ‌క్కు, భ‌ద్రత క‌ల్పించేందుకే వివరాల న‌మోదు

హైద‌రాబాద్ : ప్రజల ఆస్తుల‌పై హ‌క్కులతోపాటు వాటికి భ‌ద్రత క‌ల్పించ‌డానికే రాష్ట్రంలోని ప్రతి కుటుంబ వివ‌రాలు, నిర్మాణాల‌ను న‌మోదు చేస్తున్నామ‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. వ్యవసాయ త‌ర‌హాలోనే వ్యవసాయేత‌ర ఆస్తుల‌కు కూడా ప‌ట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాల‌నలో ప్రభుత్వం ఉందన్నారు. రెవెన్యూ చ‌ట్టంలో ఇది మైలు రాయిగా నిలుస్తుంద‌ని మంత్రి తెలిపారు. ఈ నెల 10వ తేదీలోగా ఆయా గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలోని నిర్మాణాల న‌మోదు ప‌క‌డ్బందీగా పూర్తి చేయాల‌ని మంత్రి ఆదేశించారు.

గ్రామ పంచాయ‌తీల్లో నిర్మాణాల‌ న‌మోదు పై అడిష‌న‌ల్ క‌లెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ధ‌ర‌ణి పోర్టల్ ద‌స‌రా సంద‌ర్భంగా ప్రారంభ‌వుతుంద‌ని సీఎం కేసీఆర్ చెప్పార‌ని, ఆలోగానే ప్రతి గ్రామంలోని నిర్మాణాలు, కుటుంబాల వివరాల‌న్నీ త‌ప్పుల‌కు తావులేకుండా ప‌క‌డ్బందీగా న‌మోదు చేయాల‌ని చెప్పారు. 


ఇంటి యజమానుల నుంచి ఆధార్ నెంబర్,  ఫోన్ నెంబర్ ఖచ్చితంగా తీసుకోవాల‌న్నారు. ఒకవేళ యజమాని గనుక చనిపోతే.. ఎలాంటి వివాదాలకు తావులేకుండా అత‌ని వారసుల పేరుమీద మ్యూటేషన్ చేయాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో నిర్మించిన అన్ని ఆస్తులను కూడా నమోదు చేయాలని మంత్రి  అధికారులను ఆదేశించారు. స‌మావేశంలో పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ ర‌ఘునంద‌న్ రావు, ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు. 


logo