ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 02:34:56

యాసంగి సాగు 61 లక్షల ఎకరాలు

యాసంగి సాగు 61 లక్షల ఎకరాలు

  • అత్యధికంగా వరి 43 లక్షల ఎకరాల్లో 
  • ప్రణాళిక సిద్ధంచేసిన వ్యవసాయ శాఖ 
  • 18.30 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ ఏడాది వానకాలం సాగు ముగింపు దశకు చేరుకోవడంతో వ్యవసాయశాఖ యాసంగి సాగుపై దృష్టిసారించింది. ఇందుకు సంబంధించి సాగువిస్తీర్ణం, ఎరువులు, విత్తనాల అవసరాలపై ప్రణాళిక రూపొందిస్తున్నది. యాసంగిలో 61.57 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేయాలని అంచనాలు రూపొందించింది. వరిని అత్యధికంగా 43.31 లక్షల ఎకరాల్లో, తర్వాత మక్కజొన్నను 8 లక్షల ఎకరాల్లో సాగుచేసేలా ప్రణాళిక సిద్ధంచేసింది. గత యాసంగిలో 53.82 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా.. ఈసారి 7.75 లక్షల ఎకరాలు పెంచింది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురియడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాసంగి సాగుకు పుష్కలమైన నీళ్లు ఉండటంతో గతంతో పోల్చితే ఈ ఏడాది సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనావేస్తున్నారు. ఇందుకనుగుణంగా విత్తనాలు, ఎరువులను సమకూర్చడంపైనా వ్యవసాయశాఖ దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులతో రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఎరువులకు సంబంధించి కేంద్రంతోనూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్‌కు 18.30 లక్షల టన్నులను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్నది. ఇందులో అత్యధికంగా 10 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. 1.2 లక్షల టన్నుల డీఏపీ, 1.1 లక్షల టన్నుల పొటాష్‌, 0.5 లక్షల టన్నుల సూపర్‌ పాస్పేట్‌, 5.5 లక్షల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు ఉన్నాయి. 

15.56 లక్షల క్వింటాళ్ల విత్తనాలు 

ఈ ఏడాది యాసంగి సీజన్‌కు 15.56 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ అంచనావేసింది. యాసంగిలో 8 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగు చేసేలా ప్రణాళిక రూపొందించినా.. దానిసాగుపై సాగుపై సందిగ్ధం నెలకొన్నది. ఇప్పటికే దేశంలో అవసరానికి మించి మక్కలు పండుతుండటం, విదేశాల నుంచి కోటి టన్నుల మక్కల దిగుమతికి కేంద్రం నిర్ణయించడం మక్కజొన్న సాగుపై ప్రభావం చూపనున్నాయి. డిమాండ్‌ లేదనే ఉద్దేశంతో ఈ వానకాలంలోనే మక్కలను సాగు చేయొద్దని సీఎం కేసీఆర్‌ రైతులకు సూచించారు. సీఎం సూచన మేరకు రైతులు మక్కను సాగు చేయలేదు. ఈ నేపథ్యంలో యాసంగిలో మక్కల సాగు ఎలా ఉంటుందో వేచి చూడాలి. మక్క తర్వాత శనగ పంటను 3.43 లక్షల ఎకరాల్లో, వేరుశనగను 3.32 లక్షల ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికలను సిద్ధం చేసింది.
logo