బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 01:12:28

కరువు తీర్చేలా జలజాతర

కరువు తీర్చేలా జలజాతర

  • ఆరేండ్లలోనే నదీజలాల పరుగులు
  • కాళేశ్వరంతో మారిన రాష్ట్ర ముఖచిత్రం

 ఎండకాలంలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నయి. చుక్క వానపడకున్నా చెట్లన్నీ పచ్చగ కళకళలాడుతున్నయి. తెలంగాణల మనమెన్నడూ చూడని సిత్రమిది.  మన రాష్ట్రం మనదైతే.. మనల్ని మనమే శాసించుకొంటే.. కనిపించిన ఫలితమిది.  యాచక దశ నుంచి శాసక దశకు చేరుకొన్న తెలంగాణకు లభించిన అపూర్వ విజయమిది. పరాయి భావాలు.. పరాయి చూపులు.. పరాయి భాష.. పరాయి చేతల నుంచి విముక్తి పొందిన జాతి.. సాధించిన ప్రగతి వెలుగులివి.

ఆరేండ్ల క్రితం పురోగామి పథంలో వేసిన తొలి అడుగు ఇంత తొందరగా విజయకేతనం ఎగురేస్తుందని ఎవరూ కలగనలేదు. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! అందరి అంచనాలు తలకిందులైనాయి. అన్ని అనుమానాలు పటాపంచలైనాయి. ఆత్మవిశ్వాసంతో అప్రతిహతంగా విజయాలను సాధిస్తూ అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.  కులాలు లేవు.. మతాలు లేవు.. వర్ణాలు లేవు.. పట్నం లేదు.. పల్లె లేదు.. అన్ని వర్గాలు.. అన్ని రంగాలు.. అన్ని జిల్లాల్ల్లోనూ అదే వేగం.. అదే దూకుడు.. ఇప్పుడు ప్రతి రాష్ట్రం మాటా.. తెలంగాణ బాటగా మారింది. ప్రతి పథకం.. ప్రతి కార్యక్రమం.. ప్రతి నిర్ణయం.. ఏదైనా సరే.. తెలంగాణయే ప్రతి రాష్ర్టానికీ రోల్‌ మోడల్‌ అయింది.  ఇవాళ తెలంగాణ అనే నాలుగక్షరాలు నాలుగు వేదాలుగా దేశమంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. అనూహ్యం.. అనితరసాధ్యం.. అసాధారణమైన ప్రగతి బావుటా ఎగురవేసిన రాష్ట్రమిది. ఎవరిపైనా ఆధారపడకుండానే.. స్వయంసమృద్ధం సాధించే దిశగా కదులుతున్నది. ఇది ఆరేండ్ల తెలంగాణ సంబురం. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ స్వరాష్ట్రంలో సాగునీటి రంగం అద్భుత విజయాలు సొంతం చేసుకున్నది. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణవాటా 1,400 టీఎంసీలకుపైగా జలాలను వాడుకున్నది. భవిష్యత్‌ అవసరాల కోసం గోదావరి మిగులుజలా ల్లో 600 టీఎంసీల వాటాను సాధించేలా దీర్ఘకాలిక ప్రణాళికను అమలుచేస్తున్నది. రాష్ట్రంలో 38 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మాణమవుతున్నాయి. ఇందులో పలు పూర్తికాగా, మరికొన్ని ప్రాజెక్టులు నిర్మాణదశలో ఉన్నాయి. తద్వారా 70 లక్షల ఆయకట్టుకు నీరందుతున్నది. మరో 15.71 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఆరేండ్లలోనే 85.71 లక్షల ఎకరాలకు జీవంపోసింది. 

1956 నుంచి 2014 వరకు తెలంగాణలో 40 లక్షల ఎకరాలకే నీరు అందింది. ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయడంతోపాటు కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు తదితర రీడిజైనింగ్‌ ప్రాజెక్టుల పనులను సైతం పరుగులు పెట్టిస్తున్నారు. కాళేశ్వరం ద్వారా రైతాంగం ఫలాలు కూడా అందుకుంటున్నది. అన్ని ప్రాజెక్టులు పూర్తయితే మరో 53.02 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. 25.93 లక్షల ఎకరాల స్థిరీకరణ కూడా సాధ్యమవుతుంది. రాష్ట్రంలో నాలుగువిడుతల మిషన్‌ కాకతీయ కింద 27,584 చెరువుల్లో పునరుద్ధరణ పనులు చేపట్టగా.. 21,601 చెరువులు పూర్వవైభవాన్ని సంతరించుకొని 15.06 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధించింది. అదనంగా 8.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం పెరిగింది.logo