శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:20:36

ఐకానిక్‌ లీడర్‌.. కేటీఆర్‌

ఐకానిక్‌ లీడర్‌.. కేటీఆర్‌

  • దేశం గర్వించదగిన నాయకుడు
  • సేవాకార్యక్రమాల ద్వారా..ఘనంగా జన్మదిన వేడుకలు
  • మంత్రి తలసాని వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యువతకు, దేశానికి ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఐకానిక్‌ లీడర్‌ అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆయన దేశం గర్వించే వ్యక్తి అని, తెలంగాణలో పుట్టినందుకు గర్వపడుతున్నామని వ్యాఖ్యానించారు. గురువారం తెలంగాణభవన్‌లో ఆర్యవైశ్యసంఘం నేత శ్రీనివాస్‌గుప్తా ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిపై రూపొందించిన 12నిమిషాల డాక్యుమెంటరీ ట్రైలర్‌ను మం త్రి, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, కర్నె ప్రభాకర్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ ప్రతిభ, ఉత్సాహన్ని ప్రపంచంలోని అనేక దేశాల నాయకులు, సంస్థల ప్రతినిధులు ప్రశంసించారని గుర్తుచేశారు. 

కేటీఆర్‌ విజన్‌, ప్రతిభ, పరిజ్ఞానం చూసి జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు ఆయన్ను ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే తనదైన విజన్‌తో పనిచేస్తున్నారన్నారు. కరోనా సమయంలో హైదరాబాద్‌లో రోడ్లు, ఫ్లైఓవర్‌లను పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు ఇస్తున్నారని, వారిలో ఉత్సాహం నింపుతున్నారని చెప్పారు. కేటీఆర్‌ జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని ఉన్నా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పరిమితంగా చేసుకోవాలని నిర్ణయించామన్నారు. 

రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్ల పంపిణీ, హరితహారంలో మొక్కలు నాటడం, వృద్ధాశ్రమాలకు నిత్యావసరాలు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వెయ్యి మంది విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బందికి ఆరోగ్య బీమా చేయించనున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వానికి ప్రకృతి కూడా సహకరిస్తున్నదని తలసాని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా, ప్రజల కోణంలో ఆలోచిస్తూ.. వారి అవసరాలను తీరుస్తున్నారని కొనియాడారు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా సంక్షేమాన్ని విస్మరించలేదన్నారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ అద్బుత ప్రతిభా పాటవాలు ఉన్న వ్యక్తి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మె ల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, దేవీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్‌కు వినూత్న శుభాకాంక్షలు

మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఓ రైతు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపాడు గ్రామంలో రైతు సముద్రాల మధు గురువారం తన పొలంలో కేటీఆర్‌కు ఆంగ్ల అక్షర ఆకృతిలో నారుతో వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అందరిని ఆకట్టుకున్నారు.

- ఫొటో: వరంగల్‌ స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌


logo