గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 12, 2020 , 16:27:49

దేశమే తెలంగాణను అనుసరిస్తుంది : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

దేశమే తెలంగాణను అనుసరిస్తుంది : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

వ‌న‌ప‌ర్తి : జిల్లాలోని వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాలకు తాగునీరు అందించే  మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు పెద్దమందడి మండలం బుగ్గపల్లి తండా వద్ద రాష్ర్ట వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, సీఈలు చెన్నారెడ్డి, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నిరంజ‌న్‌రెడ్డి మాట్లాడుతూ... దేశంలోని ఏ రాష్ట్రంతోనూ మనకు పోటీలేద‌న్నారు. మనల్నే ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయ‌న్నారు. రాబోయే రెండు తరాలకు కూడా వనపర్తి జిల్లాకు తాగునీటికి ఢోకా ఉండదన్నారు. దీనిని త్వరగా పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుందామ‌న్నారు.  వనపర్తి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు తీసుకొస్తున్న‌ట్లు తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో ఏడాదిలో కృష్ణా నీళ్లు రాని ఊరుండదన్నారు. అన్నదమ్ములు, తండ్రికొడుకులు, సమాజంలోని అనేక వర్గాల మధ్య కొట్లాటకు భూ సమస్యలు ప్ర‌ధాన కార‌ణాలుగా ఉంటున్నాయ‌న్న మంత్రి వాటిని అంతంచేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన‌ట్లు చెప్పారు. భూమి పంచాయతీలు లేకుంటే సమాజం దాదాపుగా ప్రశాంతంగా ఉంటుంద‌న్నారు. 

సీఎం కేసీఆర్ కాలజ్ఞాని...

ఎంపీ రాములు మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ కాలజ్ఞాని అన్నారు. వ్యవసాయానికి వినూత్న పథకాలతో రైతాంగానికి అండగా నిలుస్తున్నార‌ని కొనియాడారు. మిషన్ భగీరధతో తాగునీరు అద్భుత పథకమ‌న్నారు. లక్షా యాబైవేల కిలోమీటర్ల పైపులైన్లతో సాగునీరు ఇవ్వ‌డం ఒక్క‌ కేసీఆర్ కే సాధ్యమ‌న్నారు. తాగునీరుంటే తండ్లాట ఉండదు. ముఖ్యంగా ఆడబిడ్డలకు పెద్ద సమస్య తీరుతుందన్నారు. 

ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...  2014కు ముందు వేసవి వచ్చిందంటే గ్రామాలకు వెళ్లే పరిస్థితి ఉండేది కాద‌న్నారు. ఏ ఊరెళ్లినా ఖాళీ బిందెలతో ఎదురొచ్చేవారు. సీఎం కేసీఆర్ ఈ పథకం గురించి చెబితే ఇది సాధ్యమా అని అందరం భయపడ్డాం. కాగా ఇప్పుడు ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలించింది. ఇతర రాష్ట్రాలు దీనిపై రాష్ట్రానికి వచ్చి అధ్యయనం చేస్తున్నాయన్నారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా మాట్లాడుతూ... నీరు ప్రాథమిక అవసరం అన్నారు. వనపర్తికి రూ.300 కోట్ల ప్రాజెక్టు తేవడం గొప్ప విషయమ‌న్నారు. ఐదు మున్సిపాలిటీలు, నాలుగు నియోజకవర్గాలకు తాగునీరు స‌మ‌స్య తీర‌నున్న‌ట్లు పేర్కొన్నారు.
logo