శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 11, 2020 , 02:15:41

భారతీయుల చేతుల్లో మొబైల్‌ పెట్టారు

భారతీయుల చేతుల్లో మొబైల్‌ పెట్టారు

వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఆత్మీయ సంభాషణలు.. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో చూసే సౌకర్యం.. ఇవన్నీ మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఘనతలే అని చెప్పుకోవాలి. ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి బాటలు వేసిన ఆయన.. టెలికం రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అప్పటిదాకా కొన్ని వర్గాలకే పరిమితమైన ఫోన్‌.. ఆయన వల్ల దేశ ప్రజలందరి చేతుల్లోకి చేరింది. టెలిఫోన్‌ కోసం ఏండ్ల పాటు నిరీక్షించిన ప్రజలు పీవీ తీసుకున్న నిర్ణయాలతో హలో అనడం మొదలుపెట్టారు, ఇంటర్నెట్‌ను అనుభవిస్తున్నారు. ఆయన తర్వాత వచ్చిన పాలకులు ఈ రంగంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినా, వాటికి మూల పురుషుడు మాత్రం పీవీయే. టెలికం రంగం గురిం చి 1991కు ముందు, ఆ తర్వాత అని రెండు విధాలుగా చెప్పుకోవాలి. 1991లో అధికారం చేపట్టి దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించిన పీవీ.. టెలికంరంగంలోనూ ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించారు. 1994లో నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ పాలసీ(ఎన్‌టీపీ) తీసుకురావడంతో ఈ రంగంలో విప్లవాత్మకమార్పులు వచ్చాయి. దేశంలోని ప్రతి గ్రామానికి టెలిఫోన్‌ సౌకర్యం ఉండాలన్నది పీవీ ఆకాంక్ష. ఆ కోరికే ఇప్పుడు దేశనలుమూలలా కమ్యూనికేషన్‌ వ్యవస్థ విస్తరించేలా చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి 50 ఏండ్లకాలంలో కేవలం ఒక శాతం మంది వద్దే ఫోన్‌ సౌకర్యం ఉన్నది. టెలికం రంగంలోకి ప్రైవేటుసంస్థలు ప్రవేశించాక 20 ఏండ్లలో కనెక్షన్ల సంఖ్య 80 శాతం పెరిగాయి. 1995లో పీవీ ప్రధానిగా ఉన్న సమయంలోనే దేశంలో తొలిసారి మొబైల్‌ ఫోన్లు వాడుకలోని వచ్చాయి. దేశంలోనే తొలి మొబైల్‌కాల్‌ను అప్పటి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు పీవీ క్యాబినెట్‌లోని టెలికం మంత్రి సుఖ్‌రామ్‌ చేశారు. ఇంటర్నెట్‌ను కూడా ఆ సమయంలోనే అందుబాటులోకి తెచ్చారు. టెలికం రంగానికి పీవీ ఆజ్యం పోయగా, ఆ తర్వాత వచ్చిన ప్రధాని వాజ్‌పేయి టెలికం విధానాన్ని ప్రవేశపెట్టి  కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. అలా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను పీవీ అందుబాటులోకి తెచ్చిన ఫలితంగా నేడు దేశం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించింది.. సాధిస్తున్నది. - సెంట్రల్‌ డెస్క్‌


logo