ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 16:41:06

రైతు వేదికల నిర్మాణం .. చరిత్రలో సువర్ణాధ్యాయం

 రైతు వేదికల నిర్మాణం .. చరిత్రలో సువర్ణాధ్యాయం

సూర్యాపేట : రైతు వేదికల నిర్మాణం చారిత్రాత్మకమని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రైతు రాజ్యంలో ఇది నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లయిందన్నారు. అయిదు వేల మందికి ఒక వ్యవసాయ శాఖ అధికారిని నియమించిన ప్రభుత్వం రైతు వేదికల ద్వారా సంఘటితం చేయనుందన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి తండ్రి దివంగత శానంపుడి అంకిరెడ్డి స్మారకార్థం నిర్మించ తల పెట్టిన రైతు వేదికను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రైతును ఆర్థికంగా పరిపుష్టం చెయ్యడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ చేపట్టిన ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల మల్లింపు, రైతుబంధు, రుణాల మాఫీలతో రైతులకు పెద్ద పీట వేసిందన్నారు. తద్వారా రైతులకు వ్యవసాయం పై విశ్వాసం పెరిగిందన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జట్పీటీసీ జగన్ నాయక్, ఎంపీపీ కొండా పార్వతి  పాల్గొన్నారు.


logo