ఆదివారం 05 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 14:13:00

వేగంగా డంపుయార్డుల నిర్మాణాలు పూర్తి చేయాలి : మంత్రి ఎర్రబెల్లి

వేగంగా డంపుయార్డుల నిర్మాణాలు పూర్తి చేయాలి : మంత్రి ఎర్రబెల్లి

హైద‌రాబాద్  : ప్రతి ఊరుకో డంపు యార్డునిచ్చాం. ఆయా డంపు యార్డులు సాధ్యమైనంత వేగంగా నిర్మాణాలు జ‌ర‌గాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప‌ల్లె ప్రగతిలో భాగంగా నిర్మిస్తున్న డంపు యార్డులు, త‌డి పొడి చెత్త నిర్వహణ‌, సేంద్రియ ఎరువుల త‌యారీపై పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా రూపొందించిన నియ‌మావ‌ళితో కూడిన మాన్యువ‌ల్ ని హైద‌రాబాద్ లోని త‌న‌ నివాసంలో విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

 చెత్త సేక‌ర‌ణ స‌మ‌యంలోనే త‌డి, పొడి చెత్త వేరు కావాలి. ఆలా కాకపోతే, డంపు యార్డుల్లో క‌చ్చితంగా జ‌ర‌గాలన్నారు. అదే స‌మ‌యంలో సేంద్రియ ఎరువుల త‌యారీని చేప‌ట్టాలన్నారు. ఆ ఎరువుల‌తో బంగారు పంటలు పండించాలి అని అధికారుల‌ను ఆదేశించారు. అధికారుల‌కు స‌హ‌క‌రించాల్సిందిగా స‌ర్పంచ్ లు, ప్రజాప్రతినిధులకు సూచించారు. సీఎం కెసిఆర్  ఊరూరా డంపు యార్డుల‌ను మంజూరు చేశార‌న్నారు. ఆయా డంపు యార్డుల‌ను ప‌ల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మాణాలు చేప‌ట్టామ‌న్నారు.  అయితే కొన్ని గ్రామాల్లో కొంద‌రు ప్రజా ప్రతినిధులు, అధికారుల్లోనూ కొంత స్పష్టత రావ‌డం లేద‌న్నారు.

అందుకే పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డంపు యార్డుల నిర్మాణాలు, తడి, పొడి చెత్త నిర్వహణ‌, సేంద్రియ ఎరువుల త‌యారీపై నియమావ‌ళిని సిద్ధం చేసింద‌న్నారు. ఈ నియ‌మావ‌ళిని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామ‌న్నారు.  క‌చ్చితంగా మార్గదర్శకాలు  పాటించాల‌ని అధికారులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. అలాగే డంపు యార్డుల‌ను వేగంగా పూర్తి చేసుకోవాల‌న్నారు.  కార్యక్రమంలో పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ రఘునంద‌న్ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo