బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 13:06:44

నోట్ల రద్దు దుష్ఫలితాలు ఇంకా వెంటాడుతున్నయ్‌ : మంత్రి కేటీఆర్‌

నోట్ల రద్దు దుష్ఫలితాలు ఇంకా వెంటాడుతున్నయ్‌ : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు దుష్ఫలితాలు ఇంకా వెంటాడుతున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. హోటల్‌ మారియట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘హుషార్‌ హైదరాబాద్‌ విత్‌ కేటీఆర్‌’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హాజరై మాట్లాడారు. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారని, వాణిజ్యంతో పాటు అనేక రంగాలను దెబ్బతీసిందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణలో ఆరునెలల కాలానికి కరెంటు చార్జీలు రద్దు చేశామన్నారు. కరోనా సమయంలో వ్యాపార వర్గాలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి అనేక మంది విరాళాలు ఇచ్చారన్నారు.

కేంద్రం ప్యాకేజీ ఎవరికీ అందలేదు

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందలేదన్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఎనిమిది త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి క్షీణిస్తూ వచ్చిందన్నారు. కేంద్రం తీసుకువచ్చిన పెద్దనోట్ల రద్దుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇబ్బందిపడ్డాయన్నారు. పెద్ద నోట్ల రద్దు దుష్ఫలితాలు ఇంకా కొనసాగుతున్నాయని, ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందన్నారు. మేం అధికారంలోకి రాక ముందు పారిశ్రామికవేత్తలు కరెంటు కోసం ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాలు చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. నేను చదువుకునే రోజుల్లో హైదరాబాద్‌లో కర్ఫ్యూల కారణంగా సెలవులు వచ్చేవని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరగంట కూడా కర్ఫ్యూ పెట్టలేదన్నారు. 

త్వరలో కొంపల్లిలో ఐటీ పార్క్‌

త్వరలో కొంపల్లిలో ఐటీ పార్క్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఐటీరంగాన్ని నలుదిక్కులా విస్తరిస్తున్నట్లు స్పష్టం చేశారు.  హైదరాబాద్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధిరంగాలను వికేంద్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట టౌన్‌ షిప్‌లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌, ఏరో స్పేస్‌, ఎలక్ట్రానిక్‌ రంగాలకు అద్భుతమైన భవిష్యత్‌ హైదరాబాద్‌లో ఉందన్నారు. హైదరాబాద్‌ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌ అని, ప్రపంచంలో వినియోగించే వ్యాక్సిన్లలో మూడో వంతు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాలు బాగుంటే పెట్టుబడులు భారీగా వస్తాయన్నారు. హైదరాబాద్‌లో మత ఘర్షణలు లేవని, ప్రాంతీయ విభేదాలు లేవన్నారు. ఆరేండ్లుగా హైదరాబాద్‌ ఎంతో ప్రశాంతంగా ఉందని తెలిపారు. ఏ నగరంలోనైనా శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. హైదరాబాద్‌లో ఐదు లక్షల సీసీ లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, షీటీమ్స్‌ ఏర్పాటు చేసి మహిళల భద్రతకు భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు.  గడిచిన ఆరేళ్లలో నగరంలో ఎలాంటి అశాంతి, అభద్రతా భావం లేదన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎప్పడూ రాజీపడలేదన్నారు. 


logo