శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 02:19:05

అలీబాబా చైనా దొంగలు!

అలీబాబా చైనా దొంగలు!

  • యాప్‌లతో డాటా చౌర్యం
  • ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌,డేటింగ్‌ యాప్‌తో వల 
  • అలీబాబా సంస్థ సర్వర్లో బెట్టింగ్‌ ఫంటర్ల డాటా! 
  • ఇక రంగంలోకి ఎన్‌ఐఏ?

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కలర్‌ ప్రిడిక్షన్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌ ముసుగులో చైనీయులు లక్షల మంది భారతీయుల డాటాను చోరీచేశారు. బెట్టింగ్‌ గేమ్‌లే కాదు.. డేటింగ్‌ సైట్స్‌.. ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌లకు సంబంధించిన డాటాను సైతం కొల్లగొట్టారు. భారతదేశంలో తమ సంస్థలను ఏర్పాటుచేసిన చైనా.. ఒకపక్క ఆర్థికంగా.. మరోపక్క దేశ ప్రజల రహస్య సమాచారాన్ని సేకరించింది. ఆ డాటా అంతా అలీబాబా సర్వర్లలో దాచిపెట్టింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టిన తాజా దర్యాప్తులో చైనా సంస్థల కుట్ర బట్టబయలైంది. అలీబాబా 40 దొంగల కథల తరహాలో.. కలర్‌ ప్రిడిక్షన్‌ పేరుతో ఢిల్లీ కేంద్రంగా ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తూ అమాయకులను మోసగించిన చైనాకు చెందిన యా హవోతోపాటు గురుగావ్‌వాసులు ధీరజ్‌సర్కార్‌, అంకిత్‌కపూర్‌, నీరజ్‌తులీలను హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు గతనెలలో అరెస్టుచేశారు.

ఈ కేసు విచారణ జరుగుతుండగానే.. ఈడీ, ఆదాయం పన్ను శాఖలు రంగంలోకి దిగాయి. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కూడా దర్యాప్తు చేపట్టింది. హైదరాబాద్‌ పోలీసుల విచారణలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌తోపాటు హవాలా దందా వెలుగులోకి వచ్చింది. 200 ఖాతాలను విశ్లేషించడంతో ఒక ఖాతాలోకి బెట్టింగ్‌కు సంబంధించి కోటి రూపాయలు వస్తే.. అదే ఖాతాలోకి ఇతరమార్గాల ద్వారా వందల కోట్ల లావాదేవీలు నిర్వహించారని తేలింది. విచారణలో రూ.1500 కోట్ల లెక్కలు ప్రాథమికంగా తేలాయి. ఆ ఖాతాల్లో రూ.3 వేల కోట్లకుపైగానే లావాదేవీలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు. దేశ భద్రతపరమైన విషయాలు సైతం వెలుగులోకి వస్తుండటంతో సైబర్‌క్రైమ్స్‌ ఎస్సై మదన్‌గౌడ్‌ బృందం.. ఉన్నతాధికారుల ఆదేశాలతో భిన్నకోణాల్లో వివరాలను సేకరిస్తున్నది. ఆ సమాచారాన్ని ఎన్‌ఐఏతో పంచుకుంటున్నది.  

కొందరు ఆడిటర్లే మాయగాళ్లు!

ఢిల్లీలో ఉన్న కొందరు ఆడిటర్లే మాయగాళ్ల అవతారమెత్తుతున్నారు. సైబర్‌పరంగా దోచేయాలనే ఉద్దేశంతో పలువురు చైనీయులు           ఇండియాలో సంస్థలను ఏర్పాటుచేస్తున్నారు. నేరుగా కంపెనీల రిజిస్ట్రేషన్‌కు విదేశీయులకు వీలులేదు. దీనితో ఢిల్లీలోని కొందరు ఆడిటర్లు రూ.4 లక్షలు తీసుకొని, రిజిస్ట్రేషన్‌ బాధ్యత తీసు     కుంటున్నారు. కంపెనీ రిజిస్ట్రేషన్‌ సమయంలో దుకాణదారులను, తోపుడుబండ్లు, చాయ్‌డబ్బా, పాన్‌డబ్బా వాళ్ల నుంచి ఆధార్‌కార్డులు తీసుకుంటున్నారు. వాళ్లకు నెలరోజులకు రూ. 30 వేల వరకు చెల్లించి, రిజిస్ట్రేషన్‌, బ్యాంకు ఖాతాలు తెరిచేంత వరకు డైరెక్టర్లుగా కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత వాళ్లను తీసేస్తూ, బ్యాంకింగ్‌ లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే         నిర్వహిస్తున్నారు. 

ఓ వైపు హవాలా.. మరోవైపు వడ్డీ వ్యాపారం

యాప్‌ల ద్వారా వచ్చిన డబ్బును హవాలా రూపంలో చైనాకు తరలిస్తూనే.. మరోవైపు మనదేశంలోనే ఆ డబ్బును నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌లలో పెట్టుబడులు పెట్టి, చిరువ్యాపారులకు వడ్డీలకు అప్పులిస్తున్నారు. యాప్‌ల ద్వారా నిమిషాల్లోనే అప్పులిచ్చే సంస్థల్లో చైనా కంపెనీలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రూ.10 వేలు అప్పు అవసరముందని కస్టమర్‌ యాప్‌లోకి వెళ్తే, పూర్తి డాటా సేకరించి, వెంటనే రూ.6 వేలు కస్టమర్‌కు అందిస్తారు. రూ.4 వేలు ముందుగానే వడ్డీగా తీసుకుంటారు. వాయిదాల పద్ధ్దతిలో మొత్తం డబ్బు రూ.11 వేలు వసూలు చేస్తారు. డబ్బు తిరిగి చెల్లించకపోతే అతడి ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టడం, తెలిసినవారికి ఫోన్లు వంటివి చేస్తుంటారు. ఇక్కడ కూడా డబ్బు ఎరగాచూపుతూ భారీగా డాటాను చైనాయాప్‌లు సేకరిస్తున్నాయి. డేటింగ్‌ యాప్‌లతో యువతులను వలవేస్తూ, సాఫ్ట్ట్‌వేర్‌ కనికట్లతో యువతను నిండుగా దోచేస్తున్నారు.

అలీబాబా సర్వర్లలో డాటా నిక్షిప్తం!

కలర్‌ ప్రిడిక్షన్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సంస్థలు తమ డాటాబేస్‌ను చైనాలోని అలీబాబా సంస్థ సర్వర్లలోనే దాచిపెట్టినట్టు వెల్లడయ్యింది. పేటీఎం డాటాను కూడా అలాగే దాచిపెట్టారా? అనే అనుమానాలు వస్తున్నాయి. అదే నిజమైతే.. కోట్లమంది భారతీయుల డాటా చైనా చేతిలో ఉన్నట్టే. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేముల్లో డబ్బు వసూళ్లు, చెల్లింపుల్లో పేమెంట్‌ గేట్‌వే పేటీఎం ప్రధాన భూమిక పోషించింది. పేటీఎంలో అలీబాబా వాటాలు కూడా ఉన్నాయి. చైనా యాప్‌లతో డాటా చౌర్యం జరుగుతుందని కేంద్రం గుర్తించి ఇటీవల పలు యాప్‌లను నిషేధించించింది. ఈ పరిణామాలు హైదరాబాద్‌ పోలీసులు వెలుగులోకి తెచ్చిన తర్వాత జరగడం గమనార్హం. అలీబాబా సర్వర్లలో డాటా నిక్షిప్తమవుతున్నదనే సమాచారంతోనే ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది.