శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 02:38:27

గల్ఫ్‌ కార్మికులపై కేంద్రం కత్తి!

గల్ఫ్‌ కార్మికులపై కేంద్రం కత్తి!

  • ఇక్కడ ఇవ్వరు..అక్కడ ఇవ్వనివ్వరు
  • విదేశాల్లో కనీస వేతనాలపై దొంగదెబ్బ
  • ప్రవాస కార్మికులపై కక్షగట్టిన కేంద్ర ప్రభుత్వం
  • కనీస వేతన సిఫారసు ఒప్పందాల్లో భారీ కోత
  • తాను చేసుకొన్న ఒప్పందాల్లోనే మార్పులు 
  • గల్ఫ్‌ దేశాల్లో మన కార్మికుల నెత్తిన పిడుగు
  • కేంద్రం తీరుపై అల్లాడిపోతున్న కార్మికులు 

ఇప్పటికే ఎడారి దేశాల్లో కనీస వేతనాలు అమలు కావట్లేదని బాధపడుతున్నాం. అలాంటిది మన దేశ ప్రభుత్వమే తక్కువ వేతనానికి సిఫారసు చేస్తే, గల్ఫ్‌ కంపెనీలు మన కార్మికుల పట్ల ఎలా ప్రవర్తిస్తాయో అర్థం చేసుకోండి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే పోరాడుతాం.

- గుగ్గిళ్ల రవి గౌడ్‌, గల్ఫ్‌ జేఏసీ కన్వీనర్‌, యూఏఈ

అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు. ఇదీ మోదీ సర్కారుతీరు. ఇక్కడ కార్మికులకు కనీసవేతనాలు ఇవ్వడానికి మనసొప్పదు. ఉన్న చట్టాలను అడ్డగోలుగా మారుస్తున్నది. ఇక్కడ సరైన కూలీ దొరక్క దుబాయికో.. సౌదీకోపోయి కష్టపడి సంపాదించుకొందామనుకొంటే.. అక్కడా సరైన వేతనం రాకుండా మోకాలడ్డుతున్నది.  

గల్ఫ్‌దేశాలతో ఒప్పందాలు చేసుకొని కనీస వేతనాలను సిఫారసు చేస్తారు. అంతలోనే తగ్గిస్తారు. ఇచ్చేది మోదీ జేబులోంచి కాదు.. కేంద్రం ఖజానా నుంచీ కాదు.. పొరుగుదేశాల్లో పనిచేసుకొని పొట్టనింపుకోవడానికి వెళ్లిన కార్మికులకు అక్కడి కంపెనీలు ఇచ్చే కనీస వేతనాలను కాస్త ఎక్కువ ఇమ్మని సిఫారసు చేస్తే మోదీ సొమ్మేం పోతుంది? ఎవరి కొమ్ముకాయడానికి కార్మికులను బలిపెడుతున్నారు? గల్ఫ్‌ దేశాల్లో అల్లాడిపోతున్న కార్మికుల ఆవేదన ఇది.

జగిత్యాల, నమస్తే తెలంగాణ: కార్మికుల సంక్షేమంపై మోదీ సర్కారు ఉత్తుత్తి మాటలు చెప్పమంటే ఓహ్‌.. బోలెడు చెప్తుంది. కానీ.. దొంగచాటున చేయాల్సినంత అన్యాయం చేస్తుంది. ఎవరినీ సంప్రదించకుండా కార్మిక చట్టాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నది. స్వదేశంలో సరైన వేతనం దక్కనివ్వదు. నాలుగు డబ్బులు ఎక్కువొస్తా యని పొట్టచేతపట్టుకొని.. దేశంకాని దేశానికి వెళ్లి.. ఇసుక తిన్నెల్లో కనాకష్టం పడుతుంటే.. అక్కడా సరైన వేతనం రాకుండా దొంగదెబ్బతీస్తున్నది. గల్ఫ్‌దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కనీస వేతన సిఫార్సుల్లో 30 శాతం పైన కోత విధిస్తూ .. అక్కడి కంపెనీలకు మేలు కలిగేలా వ్యవహరించి.. దాదాపు కోటి మంది కార్మికుల కడుపుకొట్టింది. ఐదేండ్ల క్రితం తాను సిఫార్సు చేసిన కనీసవేతన మొత్తానికి గండికొట్టింది. స్వదేశంలో బతుకలేక విదేశాలకు వెళ్తే అక్కడా పైస పుట్టకుండాచేస్తున్నారని మోదీ సర్కారుపై గల్ఫ్‌ కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

12 దేశాలతో ఒప్పందాలు

దశాబ్దాలుగా ఎడారి దేశాల్లో భారతీయ కార్మికులు ఉపాధి పొందుతున్నప్పటికీ.. కనీసవేతనాలు, అలవెన్సులు పొందటంలో  గ్యారంటీ లేకుండా పోయింది. మన కార్మికులకు కనీస వేతనాలు ఇప్పించేలా కేంద్రం ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకోవాలని.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌జీవోలు, ప్రవాస కార్మికుల సంక్షేమ సంఘా లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. రెండు దశాబ్దాల కృషి తర్వాత 2010లో అప్పటి యూపీఏ సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌, ఒమన్‌, ఖతర్‌, బహ్రెయిన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, ఇండొనేషియా, లెబనాన్‌, మలేషియా, ఇరాక్‌, జోర్డాన్‌లతో చర్చించింది.  మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2015లో ఒప్పందాలు చేసుకొన్నది.

రూ.18 నుంచి రూ.34వేల కనీస వేతనం 

12 దేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు ప్రతి నెలా రూ.18వేల నుంచి రూ. 34వేల వరకు వేతనం వచ్చేలా ఒప్పందం కుదురింది. లేబర్‌, మెషిన్‌, సెంట్రింగ్‌, కార్పెంటర్‌, స్టీల్‌ ఫిట్టర్‌, ఇలా క్యాటగిరీవారీగా వేతనాన్ని నిర్ధారిస్తూ, వేతన ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. మనదేశం నుంచి వెళ్లే కార్మికులకు ఈ వేతనాన్ని కచ్చితంగా కంపెనీలు అమలు చేయాల్సి ఉంటుంది. ఓవర్‌ టైం, భోజన, వసతి సౌకర్యాలకు అలవెన్స్‌లను అదనంగా ఇవ్వాలి. ఈ సిఫార్సులను ఆయా దేశాల్లో కంపెనీలు, ప్రాంచైజీలు కచ్చితంగా అమలుచేయాలి. ఒకవేళ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే.. మన కార్మికులు ఆయా దేశాల్లోని న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కును ఈ ఒప్పందం కల్పించింది. ఏండ్లతరబడి అసంఘటితంగా ఉన్న కార్మికులకు ఈ ఒప్పందం గొప్ప ఊరటను కల్పించింది. కనీస వేతన సిఫార్సుల వివరాలను పొందుపరుస్తూ ఈ మైగ్రేట్స్‌ వెబ్‌సైట్‌ సైతం అందుబాటులోకి వచ్చింది. 


తాజాగా కేంద్రం కోత..  

ఇంతవరకు బాగానే ఉన్నది. ఎన్నో ఏండ్ల పోరాటం తర్వాత భారత ప్రభుత్వం సిఫార్సుల వల్ల కొంత ఆశాజనకమైన పరిస్థితులు నెలకొన్నాయని ఊరట పడుతున్న సమయంలో.. ఉన్నట్టుండి కనీస వేతన మొత్తాలను రూ.14,800, రూ.24 వేల వరకు సవరిస్తూ  కేంద్రం సెప్టెంబర్‌ 8, 21 తేదీల్లో సర్క్యులర్లను జారీచేసింది. వీటిలో కార్మికులకు అందించాల్సిన అలవెన్సుల ప్రస్తావన లేదు. ఈమైగ్రేట్స్‌ వెబ్‌సైట్‌లో ఈ సవరణలను అప్‌లోడ్‌ చేయడంతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇంతకుముందు ఒప్పందంలో ఆయా వృత్తులను బట్టి కనీస వేతనాలు ఉండేవి. ఇప్పుడు అన్ని క్యాటగిరీల వృత్తులకూ ఒకే వేతనాన్ని నిర్ణయించారు. అలవెన్సుల స్థానంలో నాట్‌ అవైలబుల్‌ అని ప్రకటించింది.

కోటి మందికి నష్టం

ఎడారి దేశాల్లో కోటి మందికి పైగా భారతీయులు ఉపాధిని పొందుతున్నారు. రాష్ట్రంలో జగిత్యాల, కరీంనగర్‌, సిరిసిల్ల, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజలు లక్షల సంఖ్యలో జీవనోపాధిని పొందుతున్నారు. అధికార గణాంకాల ప్రకారం సౌదీలో 32,53,901 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో 5,53,163 మంది తెలంగాణవారే. దుబాయిలో 28 లక్షలు, కువైట్‌లో 9.20 లక్షలు, ఒమన్‌లో 7.90 లక్షలు, ఖతర్‌లో 6.98 లక్షలు, బహ్రెయిన్‌లో 3.20 లక్షల మంది (మొత్తం 90 లక్షలు) భారతీయులు ఉన్నారు. వీరిలో తెలంగాణ కార్మికుల సంఖ్య 14.90 లక్షలు ఉంటుంది. కనీస వేతన ఒప్పందం వల్ల వీరందరికీ తీవ్ర నష్టం కలుగనున్నది. వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వమే.. ఒప్పందాలను నీరుగారిస్తే.. గల్ఫ్‌ కంపెనీల ఆగడాలు పెరిగిపోతాయి. అధిక వేతనాలు పొందుతున్న కార్మికులను ఉద్యోగాలనుంచి తొలిగించి.. తక్కువవేతనాలకు కొత్త కార్మికులను తెచ్చుకొనే ప్రమాదమున్నది. మన కార్మికులు తీవ్రమైన శ్రమదోపిడీకి గురవుతారు. కోర్టుల్లో ఫిర్యాదులకూ అవకాశాలు తక్కువవుతాయి.  


logo