శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 02:00:07

సన్నాల రైతుకు కేంద్రం సున్నం

సన్నాల రైతుకు కేంద్రం సున్నం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతు రాజైతేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ దృక్పథంతోనే రాష్ట్రం ఏర్పడిననాటినుంచి కూడా వ్యవసాయం సుసంపన్నం చేయడంపైనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో రైతులు తేటపడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ద్విగుణీకృతంగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై కేంద్రం నీళ్లుపోస్తున్నది. కరోనా కష్టకాలంలోనూ రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను వారి ఊళ్లల్లోకి పోయి కొన్న ప్రభుత్వం ఈసారి కూడా అదే పంథాను అనుసరిస్తున్నది. కానీ, మద్దతు ధరకు ఒక్కరూపాయి కూడా ఎక్కువిచ్చేది లేదని.. ముందుగా నిర్ణయించినదానికంటే ఒక్క గింజకూడా అదనంగా తీసుకొనేది లేదని కేంద్రం కుండబద్దలు కొట్టింది. ఎక్కువ ధరకు కొంటే తమ బాధ్యత కాదని చేతులెత్తేస్తున్నది. దీనిపై ఇటీవల ఎఫ్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. రైతులపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు రూపాయలు వస్తాయన్న ఆశతో ఎక్కువ పంటను పండించడం రైతు తప్పా? మట్టిమనిషిపై బీజేపీ చూపే ప్రేమ ఇదేనా? అని పలువురు కేంద్రం తీరును నిరసిస్తున్నారు. సన్నరకం ధాన్యం పండించిన రైతులకు కేంద్రం ఎక్కువ ధర ఇవ్వనంటున్నది. ఇస్తానంటున్న రాష్ర్టానికి మోకాలడ్డుతూ మెలికలు పెడుతున్నది. వాస్తవానికి మార్కెట్‌లో సన్నరకం బియ్యానికి భారీ డిమాండ్‌ ఉన్నది. రైతులకు లాభం రావాలని ఈ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం సన్నాలను ఎక్కువగా సాగుచేయాలని సూచించింది. ప్రభుత్వ సూచనతో రైతులు అధికంగా సన్నాలను సాగుచేశారు. అందుకు తగట్టుగానే దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉన్నది. అయితే, సన్నాలకు ఎక్కువ ధర మాత్రం చెల్లించబోమని కేంద్రం రైతుల గుండెల్లో గునపం దింపింది. ‘మద్దతు ధరకన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వం. ఒకవేళ ఎక్కువ ధర ఇస్తామని రాష్ర్టాలు ముందుకొస్తే అదనపు భారాన్ని రాష్ర్టాలే భరించాలి‘ అని  ఎఫ్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో రైతులకు ఏదైనా చేయాలనుకున్న రాష్ట్రప్రభుత్వ పరిస్థితి ఎటు పాలుపోలేని విధంగా తయారైంది. 

బీజేపీ నాయకులూ.. ఇప్పుడేమంటారు?

ఇన్నాళ్లు రైతులకు తామేంతో చేస్తున్నామని బీజేపీ చెప్పిన మాటలు.. రైతులపై చూపిన కపట ప్రేమ ఈ దెబ్బతో బట్టబయలైంది. పెద్ద సిపాయి మాటలు మాట్లాడుతున్నారు. ధాన్యం కొనుగోలు అడగడుగునా ఆంక్షలు పెడుతుండడంతో కేంద్రం ప్రభుత్వం ఇన్నాళ్లు రైతులపై చూపించింది కపట ప్రేమేనని తేలిపోయింది. బీజేపీ రాష్ట్ర నేతలు ఇప్పుడు కిక్కురుమనడం లేదు. రైతుల ప్రేమను మాటల్లో కాదు, చేతల్లో చూపించాలంటూ బీజేపీ నేతలను టీఆర్‌ఎస్‌ శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నాయి. వెంటనే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో వాదించి ఎఫ్‌సీఐ ఇచ్చిన ఆర్డర్‌ను రద్దు చేయించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఆ ధాన్యం మేం కొనలేం..

సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం, సమృద్ధిగా వానలు కురవడంతో ఈ సీజన్‌లో సుమారు 53 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో సన్నరకం ధాన్యా న్ని 39.66 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. దొడ్డు రకం ధాన్యాన్ని 13.33 లక్షల ఎకరా ల్లో సాగు చేశారు. సన్నరకం ధాన్యం 99.15 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని, దొడ్డు రకం ధాన్యం 33.35 ల క్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు.  మొత్తంగా ఈ సీజన్‌లో 132.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఈ ధాన్యం నుంచి సుమారు 89 లక్షల టన్నుల బియ్యం వచ్చే అవకాశం ఉన్నది. ఇంత భారీ విస్తీర్ణంలో వరిసాగు చేయడం రైతుల తప్పు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తున్నది. ప్రస్తుతానికి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. ఒకవేళ ఈ ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనున్నది. రైతుల కో సం ఆర్థికభారాన్ని భరించేందుకు  ప్రభు త్వం సిద్ధంగా ఉన్నా, సేకరించిన ధాన్యాన్ని ఏం చేయాలనేది ప్రశ్నార్థకంగా మారింది.